ఇంటినుండి పనిచేయడం ఇక సర్వసాధారణం

ఉపాధి మనందరి జీవితాల్లో అతిముఖ్యమైన భాగం. అది ఉద్యోగమైనా కావచ్చు లేదా స్వయం ఉపాధి అయినా కావచ్చు. ఉద్యోగం చేసేవాళ్లకు ఆఫీసుకు వెళ్లడం తమ దైనందిన జీవితాల్లో అతి ముఖ్యమైన కార్యకలాపంగా మారింది. ఉదయమే అల్పాహారం ముగించిన తరవాత అంతా సర్దుకొని స్వంత వాహనంపైనో లేదా ప్రజా రవాణా వ్యవస్థ ద్వారానో ట్రాఫిక్ జాంలను తట్టుకుంటూ ఆఫీసుకు చేరడం మనందరి జీవితాల్లో భాగమైపోయింది.

అయితే కొన్ని సంస్థల్లో ఇంటినుండి పనిచేయడం అనే వ్యవస్థ కూడా ఉన్నది. వాళ్లనే ‘రిమోట్ వర్కర్స్’ అని పిలుస్తూంటారు. కానీ ఇటువంటి సౌకర్యం ఇప్పటివరకూ కొద్దిమంది ఉద్యోగులకు మాత్రమే పరిమితమై ఉండేది.

అయితే ప్రపంచం కరోనా మహమ్మారి కబంద హస్తాల్లో చిక్కుకున్న తర్వాత ప్రజలు గడప దాటాలంటే భయపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో చాలా ప్రభుత్వ మరియు ప్రయివేటు సంస్థలు తమ ఉద్యోగులు ఇంటినుండి పనిచేసేలా చర్యలు చేపడుతున్నాయి. ‘కనెక్టెడ్ వర్క్ ప్లేస్’ పేరుతొ ఉద్యోగులకు తమ ఇళ్లలోనే అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. టెక్ దిగ్గజం గూగుల్ తమ ఉద్యోగులకు ఇంటినుండి పనిచేయడానికి అవసరమైన ఫర్నిచర్ మరియు ఇతర పరికరాలు కొనడానికి వెయ్యి డాలర్లు ఇస్తున్నదని వార్తలు వచ్చాయి. చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఇళ్లలోనే ‘హోమ్ ఆఫీస్’ లు ఏర్పాటు చేసుకోవడానికి ప్రోత్సహిస్తున్నాయి.

ఇంటినుండి పనిచేయడం అనేది ఇకనుండి ఒక సర్వ సాధారణమైన వ్యవహారంగా మారే అవకాశమున్నదని చాలామంది పరిశీలకులు అభిప్రాయ పడుతున్నారు. ఈ నేపథ్యంలో జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ వంటి వీడియో కాన్ఫరెన్సింగ్ అప్లికేషన్లకి డిమాండ్ విపరీతంగా పెరిగింది.

ఇళ్ళనుండి పనిచేస్తున్న ఉద్యోగుల మధ్య ఎడం తగ్గించడానికి, పరస్పరం సంభాషించుకుంటూ, సహకరించుకుంటూ వారి కార్యకలాపాలు చక్కదిద్దుకోవడానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింతగా అభివృద్ధి చేయడానికి ముమ్మరంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వర్చ్యువల్ కాన్ఫరెన్సింగ్ మరియు కొలాబరేషన్ సాఫ్ట్వేర్ లు ఇకముందు మరింతగా వాడుకలోకి వచ్చే అవకాశం ఉన్నది.

అంతేకాకుండా ఉద్యోగులు ఇంటినుండి పనిచేయడంవల్ల వారి ఉత్పాదకత తగ్గుతుందనే అపోహకు కూడా తెరపడిందని వార్తలు వస్తున్నాయి. ఇంటినుండి పనిచేయడం వల్ల ఉద్యోగుల ఉత్పాదకత, సామర్థ్యంలో ఎటువంటి క్షీణింపు లేదని అనేక అధ్యయనాల్లో వెల్లడయింది.

ఇక ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయం వల్ల ఆర్ధిక వ్యవస్థల్లో సమూలమైన మార్పులు వస్తాయని చాలామంది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. కొత్త రకమైన ఉద్యోగాలు సృష్టించబడతాయని, ఆ ఉద్యోగాలు చేయడానికి సరి కొత్త నైపుణ్యాలున్న వ్యక్తులు అవసరమౌతారనీ అందుకే ఉద్యోగాభిలాషులు తమ తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడం, లేదా కొత్త నైపుణ్యాలను సాధించడం వంటి విషయాలపై ద్రుష్టి కేంద్రీకరించాలని సలహా ఇస్తున్నారు.

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments