బీటలువారుతున్న ప్రజారోగ్య వ్యవస్థ

0
11

భారత్ లో ముందుగానే లాక్ డౌన్ విధించడానికి అతి ముఖ్యమైన కారణం కొరోనా వైరస్ పెద్ద ఎత్తున ప్రబలితే అసలే అంతంత మాత్రంగా ఉన్న మన ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలి పోతుందని నిపుణులు ముందుగా హెచ్చరించడం వల్లనే.

దేశంలో ప్రభుత్వాలు ప్రజారోగ్యాన్ని విపరీతంగా అలక్ష్యం చేయడం వల్ల ప్రభుత్వ వైద్య శాలలు నరక కూపాలుగా తయారయ్యాయి. ఇక ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకొని కార్పొరేట్ వైద్యశాలలు రాబందులవలె డబ్బులు దండుకుంటూ ప్రజల్ని పీల్చి పిప్పిచేస్తున్నాయి. ఇటివంటి పరిస్థితుల్లో ఈ కొరోనా వైరస్ భారత్ పై దండెత్తింది.

మొదట్లో పరిస్థితి ఆశావహంగానే ఉన్నప్పటికీ తబ్లీఘి జమాత్ వాళ్ళ మత మౌఢ్యం వల్ల ఈ వైరస్ దేశం మొత్తం వ్యాపించింది. లాక్ డౌన్లను రాష్ట్ర ప్రభుత్వాలు అంతంత మాత్రంగానే అమలు చేయగలిగాయి. చాలాప్రాంతాల్లో సంఘ విద్రోహ శక్తులు పోలీసులకూ, వైద్య సిబ్బందికి సహకరించకుండా వారిపై దాడులు చేస్తూ, ప్రార్థనా స్థలాల్లో గుమిగూడి సామూహిక ప్రార్థనలు నిర్వహించారు. ఇటువంటి చర్యల వల్ల కొరోనా వైరస్ వేగంగా ప్రబలిపోతున్నది.

ముఖ్యంగా మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, గుజరాత్ మరియు ఢిల్లీ లలో ఈ వైరస్ అతి వేగంగా విస్తరిస్తున్నది. మహారాష్ట్ర ప్రభుత్వం పాలనపై పట్టు కోల్పోయి నిస్సహాయ స్థితికి జారుకున్నట్లుగా కనిపిస్తున్నది. ఆ రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఒకే బెడ్ పై ఇద్దరు రోగులకు చికిత్స అందిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. దారుణమైన విషయమేమంటే మృతదేహాలను భద్రపరచే గదుల్లో స్థలం లేకపోవడంతో మృతదేహాల ప్రక్కనే రోగులకు చికిత్స అందిస్తున్నట్లుగా వస్తున్న వార్తలు చాలా ఆందోళన కలిగిస్తున్నాయి. ముంబాయి నగరం మరొక న్యూయార్క్ లా తయారవుతున్నదని చాలామంది పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.

మనదేశంలో కొరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఇంకా లక్షకు కూడా చేరక ముందే మన ప్రజారోగ్య వ్యవస్థ బీటలువారుతున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నది. ఇక ముందు పరిస్థితి భీతావహంగా ఉండబోతున్నదేమోననే భయం ప్రజల్ని వెంటాడుతున్నది.

ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం కొరోనా వైరస్ మరణాల సంఖ్యను దాచిపెడుతూ సమస్య తీవ్రతను తక్కువ చేసి చూపించే ప్రయత్నాలు చేస్తున్నదనే ఆరోపణలు గుప్పుమన్నాయి.

ఇక మమతా బనెర్జీ పాలనలో ఉన్న పశ్చిమ బెంగాల్ లో ఏమి జరుగుతున్నదో ఎవరికీ తెలియని పరిస్థితి. ఆరాష్ట్రంలో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉన్నదనీ, పాజిటివ్ కేసుల మరియు మరణాల సంఖ్య పై పారదర్శకత లేదనీ వార్తలు వస్తున్నాయి. పైగా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరించకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తుండడంతో పరిస్థితి మరింతగా దిగజారుతున్నది.

మన దేశంలో కొరోనా వైరస్ టెస్టింగ్ శాతం చాలా తక్కువగా ఉండడంవలనా, చాలామంది రోగుల్లో ఎటువంటి లక్షణాలు కనిపించక పోవడం వలనా, వ్యాధి వేగంగా విస్తరిస్తున్నదని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే దేశంలో పరిస్థితి మరింత దిగజారి మృత్యువు విలయతాండవం చేసే అవకాశం ఉన్నది.

ఏదేమైనా భారత్ కొరోనా వైరస్ పై సుదీర్ఘకాలం పోరాడవలసిన పరిస్థితి వచ్చినట్లుగానే అనిపిస్తున్నది. ఇక మనమంతా ఈ వైరస్ తో కొంతకాలం సహజీవనం చేయాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలంతా ఎంతో క్రమశిక్షణతో, బాధ్యతతో మెలగాల్సిన అవసరమున్నది. తగిన జాగ్రత్తలు పాటిస్తూ, తమ ఆరోగ్యాన్ని, తమ తోటి వారి ఆరోగ్యాన్ని సంరక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నది. తమ బాధ్యతల్ని విస్మరించి విచ్చలవిడిగా ప్రవర్తించే వారివల్ల సమాజం మొత్తానికి పెను ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments