భద్రతా బలగాలవాళ్ళు టెర్రరిస్టు ముష్కరుల్ని ఎన్కౌంటర్లలో మట్టుబెట్టినప్పుడల్లా మీడియా వాళ్లు భర్తను పోగొట్టుకున్న భార్య వలె ఎందుకు ఏడుస్తారో ఇప్పటికీ అర్థంకాని విషయం. ఇది భారతీయ మీడియాకు మాత్రమే పరిమితమైందనుకుంటే పొరపాటు. అంతర్జాతీయ మీడియా కూడా ఇదేవిధంగా ప్రవర్తిస్తూ వస్తున్నది.
కొద్దికాలం క్రితం ఐసిస్ ఉగ్రవాద ముష్కర ముఠా నాయకుడు అబూ బకర్ అల్-బాగ్దాదీ ని అమెరికా సైనికులు మట్టుబెట్టిన తర్వాత ప్రసిద్ధినొందిన వాషింగ్టన్ పోస్ట్ పత్రిక ఆ టెర్రరిస్టుని ఒక నిరాడంబరమైన, సరళమైన ఆధ్యాత్మిక వేత్తగా కొనియాడుతూ ట్వీట్ చేసింది. ఇక ఆ ట్వీట్ చూసిన వాళ్ళు కోపంతో ఆ పత్రిక వాళ్ళను చాకిరేవు పెట్టడం ప్రారంభించారు. ఇక తట్టుకోలేక ఆ ట్వీట్ ను ఉపసంహరించుకున్నారు.

ఇక మరొక ప్రసిద్ధి నొందిన అమెరికన్ దినపత్రిక న్యూయార్క్ టైమ్స్ ఇదేవిధమైన ఘనకార్యం చేసింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్ పై దాడి జరిగి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయిన సందర్బంగా ఒక ట్వీట్ చేస్తూ ‘విమానాలు’ ఆ ఆకాశ హర్మ్యాలను గురిచూసి ఢీకొట్టి ధ్వంసంచేశాయని వక్కాణించింది. అంటే ఆ దుర్మార్గానికి ఒడిగట్టిన టెర్రరిస్టు ముష్కరుల ప్రస్తావన తేకుండా ఆ తప్పంతా ప్రాణంలేని విమానాలపై తోసేయ జూసింది.

ఇక మన భారతీయ మీడియా వాళ్ళు ఉగ్ర ముష్కరుల్ని వెనకేసుకు రావడానికి తామెంతకైనా తెగించగలమని ఎన్నోసార్లు నిరూపించుకున్నారు. మన భారతీయ మీడియాలో కొన్ని సంస్థలు ఇస్లామిక్ ఉగ్రవాదుల్ని ఏదోవిధంగా ‘మంచి బాలురు’ అని నిరూపించడానికి చేయని ప్రయత్నం లేదు.
కాశ్మీర్ లో భద్రతా బలగాలు బుర్హాన్ వాణి ని హతమార్చిన తర్వాత నీరా రాడియా టేపుల కుంభకోణానికి పేరెన్నికగన్న జర్నలిస్టు బరఖా దత్ ఆ టెర్రరిస్టు ను ‘ఒక స్కూల్ హెడ్ మాస్టర్ కొడుకు’ గా అభివర్ణించింది.

ఇక టెర్రరిస్టులపై ఈగకూడా వాలనీయని ఎన్డీటీవీ వాళ్లయితే టెర్రరిస్టు ముష్కరుల్ని ఆక్టివిస్టులుగాను, కార్యకర్తలుగాను చిత్రీకరించే ప్రయత్నం చాలాసార్లు చేసింది. వీళ్ళ సిగ్గుమాలిన పనులు చూసి ప్రజలెంతగా ఛీకొట్టినా వీళ్ళు తమ పద్దతి మార్చుకోరు. టెర్రరిస్టులమీద వీళ్ళకున్న ప్రేమ, సహానుభూతి అటువంటిది మరి.

ఇక ఈమధ్యనే భద్రతా బలగాలవాళ్ళు కాశ్మీర్ లో రియాజ్ నాయికూ అనబడే మరో ఉగ్ర ముష్కరుణ్ణి మట్టుబెట్టారు. మళ్ళీ మీడియా వాళ్ళు కుక్కతోక వంకర అన్న చందంగా ఆ ముష్కరుడికి మానవత్వం అంటగట్టడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాడొక గణితశాస్త్ర ఉపాధ్యాయుడనీ, గొప్ప చిత్రలేఖనా దక్షుడనీ, చక్కటి గులాబీ పువ్వుల్ని చిత్రీకరించేవాడనీ చిలవలు పలవలుగా పుంఖానుపుంఖాలుగా వ్రాయడం మొదలుపెట్టారు.
Who is going to be d first Indian journo to do white-washing of #RiyazNaikoo n tell us that ‘he was a sweet son of a school master, he was called Einstein by his classmates, and he took to terror coz a Hindu boy snatched his lollipop while he was in KG’? @BDUTT or @ShekharGupta?
— Shefali Vaidya. (@ShefVaidya) May 6, 2020


మరి టెర్రరిస్టుల గురించి ఇంత గొప్పగా వ్రాసేవాళ్ళు ఆ టెర్రరిస్టుల చేతుల్లో వీరమరణం చెందిన మన వీర సైనికుల జీవితాల గురించి, వాళ్ళ జీవితాల్లో ఇష్టాయిష్టాల గురించి వాళ్ళ కుటుంబ నేపధ్యం గురించి వ్రాయడం ఎందుకు మరచిపోయారు? ఎందుకంటే వామపక్ష భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న మీడియా వాళ్లకు ఒకటే పని. ఏదోవిధంగా ఇస్లామిక్ టెర్రరిజాన్ని ఎగదోయడం.
Hizbul Mujahideen is not a group of "rebels." It is an Islamist terrorist organization. It has been formally designated a terrorist organization by the US government. As well as the EU and India. https://t.co/kBfztCkYLq
— Jeff M. Smith (@Cold_Peace_) May 6, 2020
ఒకప్పుడు వీళ్ళు ఆ పనిని ఎంతో సులభంగా చేయగలిగే వాళ్ళు. కానీ ప్రజల్లో చైతన్యం పెరగడం వలన, మరియు వామపక్షవాదుల మరియు ఇస్లామిస్టుల మధ్య దోస్తీ ని ప్రజలంతా గుర్తెరగడం వలన, వీళ్ళ ఆటలు ఇక సాగని పరిస్థితి. వీళ్ళు ఇటువంటి రాతలు రాసినప్పుడల్లా చదువరులు సామాజిక మాధ్యమాల ద్వారా వాళ్ళను చాకిరేవు పెడుతున్నారు. ఇక ఆతిట్లు తట్టుకోలేక కొంతలో కొంత అదుపులో ఉంటున్నారు. ఇక సామాజిక మాధ్యమాలు లేకపోతె వీళ్ల విచ్చలవిడితనానికి అడ్డు అదుపు ఉండవంటే అతిశయోక్తి కాదు.