రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతులే అసలు సిసలైన రైతులా? అసలు వాళ్ళ డిమాండ్లు ఏమిటి? వారిని ఏయే శక్తులు వెనుక ఉండి నడిపిస్తున్నాయి? మిగతా రాష్ట్రాల రైతులు ఎందుకు ఆందోళనలు చేపట్టడంలేదు? పంజాబ్, హర్యానా రాష్ట్రాల రైతుల సమస్యలు మిగతా రాష్ట్రాల రైతుల సమస్యలకు భిన్నమైనవా? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో తలెత్తుతున్నాయి.

రైతుల ఆదాయాన్ని పెంచే ఉద్దేశంతో వాళ్ళు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్ముకునేందుకు వీలు కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకొచ్చింది. ఏ రంగంలో అయినా సంస్కరణలు తప్పనిసరి. ఎప్పుడూ పాత పద్ధతిలోనే ముందుకు వెళుతుంటే రైతుల ఆదాయం పెరిగే అవకాశం లేదు. అసలు ఇటువంటి చట్టాలు తీసుకువస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా ఇంతకు ముందు తమ మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇదివరకే చాలా రైతు సంఘాలు కార్పొరేట్ సంస్థలు కూడా తమ ఉత్పత్తులను కొనే విధంగా చట్టాలు తీసుకురావాలని చాలాసార్లు నిరసన ప్రదర్శనలు కూడా చేశాయి.

అయితే ఇప్పుడు అవన్నీ గాలికి వదిలేసి కొత్తగా తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వాళ్ల డిమాండ్లు చాలా వింతగా ఉన్నాయి. ఎందుకంటే ఇదివరకటి చట్టాలను బట్టి రైతులకు తమ ఉత్పత్తుల్ని ఎక్కడైనా అమ్మే స్వేచ్ఛ అనేది లేదు. వారు కేవలం ముందుగానే నిర్ణయించబడినటువంటి వ్యవసాయ మార్కెట్ లో మాత్రమే కమీషన్ ఏజెంట్ల ద్వారా వాళ్ళ ఉత్పత్తిని అమ్మాల్సి వచ్చేది. అందువల్ల రైతులు చాలా నష్టపోయేవారు.

ప్రస్తుతం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలు రైతులు తమ ఉత్పత్తులను ఎవరు ఎక్కువ ధర చెల్లించడానికి ముందుకు వస్తే వారికి అమ్ముకునే స్వేచ్ఛను కల్పించింది. ఇప్పుడు రైతు సంఘాల పేరుతో చాలామంది కొత్తగా తీసుకురాబడినటువంటి వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

వేలాదిగా ఢిల్లీ కి తరలి వచ్చి అక్కడ నిరసన ప్రదర్శన చేపట్టారు. అంతే కాకుండా కొత్తగా తీసుకురాబడిన వ్యవసాయ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే మేము ఢిల్లీ నగరాన్ని దిగ్బంధిస్తామని అంటూ బెదిరిస్తున్నారు కూడా. ఒకవేళ అదే కనుక జరిగితే ఢిల్లీ వాసులు విపరీతంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఈ నిరసన ప్రదర్శనలు ముఖ్యంగా పంజాబ్ మరియు హర్యానా ల నుంచి వచ్చిన రైతులు చేస్తున్నారు. ఈ నిరసనల్లో కొంతమంది సంఘ విద్రోహ శక్తులు, ఖలిస్థాన్ తీవ్రవాదులు చేరిపోయారని, వారిప్పటికే ఈ రైతు ఉద్యమాన్ని హైజాక్ చేశారనీ వార్తలు వస్తున్నాయి.

రైతులు ఢిల్లీ శివారుల్లో ప్రదర్శనలు చేపట్టగానే కేంద్ర ప్రభుత్వం వారిని చర్చలకు పిలిచింది. ఇప్పటికే పలు దఫాలు వారితో చర్చలు జరిపింది కానీ రైతు సంఘాల నేతలు ప్రభుత్వంతో తమ సమస్యలను మనస్ఫూర్తిగా చర్చించి పరిష్కరించుకునే ఆలోచనలో లేనట్లుగా కనిపిస్తోంది. వారు మొండిపట్టుదలతో ప్రభుత్వం పూర్తిగా వ్యవసాయ చట్టాలను వెనక్కు తీసుకోవాలని కోరుతున్నారు. దీని అర్థం రైతులు తమ ఉత్పత్తులను ఎక్కడైనా అమ్ముకునే అవకాశాన్ని, స్వేచ్ఛను వదులుకోదల్చుకున్నారా? వారు ఎప్పటిలాగానే కమిషన్ ఏజంట్ల కబంద హస్తాల్లో చిక్కుకొని నష్టపోదల్చుకున్నారా? వారికి తమ ఆదాయాల్ని పెంచుకోవడం ఇష్టం లేదా? ముఖ్యన్గా రైతులు ఈ చట్టాలపై ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారా? ప్రధాని మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాల పట్ల రైతుల్లో అవగాహన కల్గించడానికి ప్రయత్నాలు చేసిందా? ఇలా చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఇక కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని ద్వేషించే ఇస్లామిస్టులు, కాంగ్రెస్ వాళ్లు, కమ్యూనిస్టులు అందరూ కూడబలుక్కొని రైతుల్లో కొత్త వ్యవసాయ చట్టాల పట్ల పెద్ద ఎత్తున అపోహలు కల్పించి వారిని తప్పుదారి పట్టించడం ద్వారా ఎదో విధంగా హింసకు, విధ్వంసానికి పురిలోల్పే ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఈ నిరసనలను ఆసరాగా చేసుకొని హిందువులు, సిక్ఖులు ఒకరికొకరు శత్రువులంటూ వారిమధ్య వైరుధ్యాలను పెంచడానికి కూడా కొన్ని సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయి.

ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులకు ఉపయోగపడే కొత్త వ్యవసాయ చట్టాలు తెచ్చిన తర్వాత ఆ వ్యవసాయ చట్టాన్నిప్రజల్లోకి తీసుకు వెళ్ళ లేక పోయింది. ఆ చట్టాల యొక్క ఆవశ్యకత, ప్రయోజనాల్ని ప్రజలకు తెలియ జెప్పడంలో విఫలమైంది. ఇక షాహీన్ బాగ్ లో ధ్వంసరచన చేసినటువంటి ఇస్లామిస్టులు ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు చేస్తున్న రైతులకు మద్దతిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు కూడా వీళ్ళ తో చేతులు కలిపి ధ్వంస రచనకు పూనుకున్నారు.

పైగా కొత్త వ్యవసాయ చట్టాలు అమలులోకి వస్తే రైతులు తమ భూమిని కోల్పోతారని, వారికి కనీస మద్దతు ధర కూడా లభించదని అబద్దాలు ప్రచారం చేయడం మొదలు పెట్టారు. నిజానికి నరేంద్రమోడీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వమే పెద్ద ఎత్తున రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి ఖర్చు పెట్టింది. పైగా కనీస మద్దతు ధరను తాము ఇక ముందు కూడా కొనసాగిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈ రైతు సంఘాల వాళ్ళు వినకుండా తమ నిరసన ప్రదర్శన కొనసాగిస్తున్నారు.

పైగా వ్యవసాయ రంగంతో ఎటువంటి సంబంధం లేని డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకు వస్తున్నారు. దేశంలో పెద్దఎత్తున అరాచకానికి, విధ్వంసానికి ప్రణాళికలు రచించిన వరవర రావు వంటి సంఘ విద్రోహ శక్తుల్ని, షార్జిల్ ఇమామ్, ఉమర్ ఖాలిద్ వంటి ఇస్లామిస్టు తీవ్రవాదుల్ని విడుదల చేయాలనే డిమాండ్లను తెరపైకి తెచ్చారు.

రైతు ఉద్యమం పేరుతో జరుగుతున్నటువంటి ఈ నిరసన ప్రదర్శన ఏ క్షణంలో అయినా హింసాకాండ కు దారితీయవచ్చు. ఒకవేళ అదే గనుక జరిగితే ప్రపంచ యొక్క దృష్టి భారత్ వైపు మళ్లే అవకాశం ఉంది. భారత్ వ్యతిరేక శక్తులు ఆ అల్లర్లను అడ్డుపెట్టుకొని భారత్ కు వ్యతిరేకంగా విషం కట్టడానికి కాచుకొని కూర్చున్నారు. ఇప్పటికే కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో అనవసరంగా భారత్ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటూ పంజాబ్ రైతుల్ని సమర్థించారు.

అంతేకాకుండా రైతులు కేవలం పంజాబ్ లోనే ఉన్నారా ఇంకెక్కడా రైతులు లేరా? ఈ వ్యవసాయ చట్టాల వలన పంజాబ్ రైతులు మాత్రమే నష్టపోయారా? వేరే రాష్ట్రాల్లో రైతులు నష్టపోవడం లేదా? ఇటువంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా మేల్కొని ఈ నిరసన ప్రదర్శనల పేరుతొ జరుగుతున్న కుట్రలపై ఒక కన్ను వేసి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. లేకపోతే పెద్దఎత్తున విధ్వంస చెలరేగే అవకాశం ఉన్నది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments