మా పరిచయం

ఆలోచన ఒక పౌర పాత్రికేయ (సిటిజెన్ జర్నలిజం) వేదిక. ఆంగ్లంలో ఎన్నో సిటిజెన్ జర్నలిజం వెబ్సైట్లు ఉన్నప్పటికీ, తెలుగులో ఆ లోటు స్పష్టంగా కనిపిస్తున్నది. మనలో చాలామందికి తమ ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకోవడం ద్వారా సమాజంలో జరుగుతున్న చర్చలో భాగస్వాములు కావాలనే ప్రగాఢమైన కోరిక మనసులో ఉంటుంది. ఆ కోరికతోనే మనం మన కలాలకు పనిచెబుతాం. కానీ మన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చిన తర్వాత వాటిని ఎక్కడ ప్రచురించాలనే విషయంలో సందిగ్ధం మొదలవుతుంది.

పేరెన్నికగన్న పత్రికలన్నీ ఖ్యాతికెక్కిన పాత్రికేయులు, ప్రముఖులు, వ్రాసిన వ్యాసాలనే ప్రచురిస్తాయి. సామాన్యుల ఆలోచనలకు చోటు ఇవ్వరు కాబట్టి వారి అభిప్రాయాలు ప్రాచుర్యంలోకి రాకుండా పోతున్నాయి.

అంతర్జాలం మరియు చరవాణుల వినియోగం పెరగడంతో వెబ్సైటు ల వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా వార్తల వినియోగం పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పౌర పాత్రికేయానికి ప్రాధాన్యత పెరిగింది. ఔత్సాహిక పౌరులు తమ ఆలోచనలు, అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి పౌర పాత్రికేయ వేదికలు ఉపయోగపడుతాయి. ఇవి సామాన్యుల నాడిని తెలుసుకోవడంలో మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది.

ఆలోచన వెబ్సైట్ మీ వేదిక. మీ అభిప్రాయాలకు, ఆలోచనలకు, భావోద్వేగాలకు అక్షరరూపం ఇవ్వండి. మీరు చూసిన లేదా మీ చరవాణి లో బంధించిన విషయాలను మాకు పంపించండి. మేము ప్రచురిస్తాం.