భార్య పుట్టింటికి వెళితే తిండికి తిప్పలు పడాల్సిందేనా?

0
409

సాంప్రదాయ కుటుంబాల్లో వంటపని స్త్రీలదే అనే భావన ఉంటుంది. కానీ పాకశాస్త్ర ప్రావీణ్యం విషయానికి వస్తే పురుషులదే ఆధిక్యం. ‘నలభీమ’ పాకం అంటారే కానీ మరెవరినీ ఆ స్థానంలో కూర్చోబెట్టరు. ఇప్పటికీ వివాహాది శుభకార్యాల్లో వంటశాలలో మగవారే కనిపిస్తారు. అయితే ఇది అందరి మగవాళ్ల విషయంలో నిజం అనుకుంటే పొరపాటు. చాలామంది మగవాళ్ళు వంట గదిలో అడుగు పెట్టరు. అంతేకాక తామేదైనా వండినా అది తినడానికి యోగ్యంగా ఉండదు అని వాళ్ళ ప్రగాఢ నమ్మకం. అటువంటి వాళ్ళు ఆహారం విషయంలో తమ భార్యలపై అమితంగా ఆధారపడతారు. భార్య వండి వడ్డించక పోతే పూట గడవదు. ఇక భార్య పుట్టింటికి వెళితే వాళ్ళ కష్టాలు వర్ణనాతీతం.

Embed from Getty Images

ఆ ఏముంది… ఆ నాలుగు రోజులు ఏ హోటెల్లోనే తింటే సరిపోతుంది అని చాలామంది ఒక ఉచిత సలహా పడేస్తారు. కానీ హోటల్ లో దొరికే అపరిశుభ్రమైన తిండి తిని రోగాల బారిన పడి చచ్చే కంటే ఆకలితో అలమటించి చావడం మేలని అనుకునేవారు కూడా చాలామంది ఉన్నారు. ఇక అటువంటి వాళ్ళు ఏం చేయాలి? కాస్త అన్నం ఉడకేసుకొని సూపర్ మార్కెట్లో దొరికే ఏదైనా పచ్చడి సీసా కొనుక్కొని ఆ పచ్చడి వేసుకొని తినడం ఒక పరిష్కారం. కానీ కొద్ది రోజుల తర్వాత కడుపులో మంట ఎక్కువై ఇక ఆ పచ్చడి మెతుకులు ఇంకేమాత్రం తినలేని పరిస్థితి తలెత్తుతుంది. సమయానికి ఏదో ఒకటి తింటే సరిపోతుంది కదా అని మళ్ళీ సూపర్ మార్కెట్ కు వెళ్లి రకరకాల చిరుతిళ్ళు ప్యాకెట్ల కొద్ది తెచ్చి పెట్టుకొని అవి నమలడం మొదలు పెడితే అన్నం తినడానికి అలవాటు పడ్డ ప్రాణాలు కనుక ఆకలి తీరదు. కడుపులో ఏదో వెలితి పీడిస్తుంది. ఇక సూపర్ మార్కెట్లో దొరికే వెచ్చ పెట్టుకొని తినే రెడీ టు ఈట్ ఫుడ్స్ విషయానికి వస్తే అవన్నీ చప్పగా ఉంటాయి కాబట్టి అవి తినడం కన్నా గడ్డి తినడం మేలు అనే ఆలోచన వచ్చేస్తుంది. మరి ఇక ఏం తినాలి?

అందుకే భార్య ఇంట్లో ఉన్నా అప్పుడప్పుడు వంటగదిలోకి వెళ్లి ఆమెకు కాస్తోకూస్తో సాయం చేస్తుంటే ఎంతోకొంత పాకశాస్త్ర పరిజ్ఞానం ఆబ్బె అవకాశం ఉన్నది. ఇక ఆమె కొన్ని రోజులు పుట్టింటికి వెళ్లినా ఆ పరిజ్ఞానం అక్కరకు వస్తుంది. అంతే కాకుండా చాలామంది భార్యలు తమకు భర్తలు వంటింట్లో ఏ కొద్దిపాటి సాయం చేసినా అమితంగా సంతోషపడిపోతారు. ఆ సంతోషం సంసారం అనే పడవ సాఫీ గా సాగిపోవడానికి కొంత వరకూ సాయపడుతుంది. ఏమంటారు?

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments