గడ్డం క్రింద మాస్క్, నెత్తిమీద కరోనా

ఏది ఎక్కడ ధరించాలో అక్కడే ధరించాలి. కరోనా వైరస్ నుండి తమను తాము కాపాడుకోవడానికి మాస్కులు ధరించడం తప్పనిసరి అని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. అయితే మూర్ఖత్వం మూర్తీభవించిన చాలామంది వ్యక్తులు మాస్కులను తమ గడ్డం క్రింద ధరిస్తున్నారు. శ్వాసిస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, మరియు తుమ్ము లేదా దగ్గు వచ్చినప్పుడు ముక్కు, నోరు ల నుండి విడుదలయ్యే తుంపర ద్వారా ఈ వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి మాస్కు ధరిస్తే చాలావరకూ ఈ వైరస్ నుండి మనకు రక్షణ లభిస్తుందనే కారణంతో మనలను మాస్కు ధరించమంటున్నారు. ముక్కు నోరు బార్లా తెరుచుకొని మాస్కు గడ్డం క్రింద ధరించడమంత మూర్ఖత్వం మరేదీ ఉండదు.

ఇక హోటళ్లలో టేక్ అవే ల వద్ద, కర్రీ సెంటర్ల వద్ద ఆహారం ప్యాక్ చేసే వాళ్ళు, పండ్లు, కూరగాయలు అమ్మేవాళ్ళు గడ్డం క్రిందికే మాస్కులు వేసుకొంటున్నారు. అటువంటి వారివద్దనుండి ఏమైనా కొంటే కరోనా మూటగట్టుకున్నట్లే అవుతుంది కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలి.

చాలామంది ఈ మాస్కులను మొక్కుబడిగా గడ్డం క్రిందకు ధరిస్తూ తమ ప్రాణాలను, ఇతరుల ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. ఇదేమిటంటే ‘గాలాడడం లేదు’ అంటున్నారు. ఇటువంటి నిర్లక్ష్యం వల్ల కరోనా వస్తే అసలే గాలాడకుండా పోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నప్పటికీ కరుడుగట్టిన నిర్లక్ష్యంతో దూసుకు పోతున్నారు. పైగా ఎవరైనా మాస్కు ధరించండి అని వాళ్ళ క్షేమం కోరి చెబితే పట్టించుకోక పోగా కొందరైతే ‘నాకు చెప్పడానికి నీవెవరు’ అంటూ ఒంటికాలిమీద లేస్తున్నారు.

ఇక ప్రభుత్వాలు కూడా “మాకిక ఓపిక లేదు… మా చేతిలో ఏమీలేదు” అన్న చందంగా చేతులెత్తేశారు. తెలంగాణాలో అసలు ప్రభుత్వమనేదొకటుందా అనే అనుమానం కలుగుతున్నది. తెలంగాణా ప్రభుత్వం ప్రజలను కరోనా అనబడే రాబందుకు వదిలేసి చేతులు దులిపేసుకున్నది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఎన్ని సార్లు అక్షింతలు వేసినా దున్నపోతుమీద ఈగవాలిన చందంగా కరోనా వ్యాప్తి, చావులపై కాకి లెక్కలు చెబుతూ పాలకులు ప్రజల్ని బురిడీ కొట్టిస్తున్నారు.

అయితే చాలామంది సవ్యంగా ఆలోచించే, బాధ్యతగా నడుచుకునే ప్రజలు ఈవిషయాలన్నీ గమనిస్తున్నారు. మాస్కులు గడ్డం క్రిందకు ధరించే మూర్ఖులైనా, చావులపై కాకి లెక్కలు చెప్పే ప్రభుత్వమైనా తమకు సాగినంత వరకే సాగుతుందని, సమయం వచ్చినప్పుడు తమ పద్దతి మార్చుకోవలసి వస్తుందనే విషయం గ్రహించాలి. ఆ సమయం త్వరలోనే వస్తుందని ఆశిద్దాం.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments