హిందువుల పవిత్ర గ్రంధం ఏమిటి అనే ప్రశ్న ఉదయించగానే మనకు మొదటిగా స్ఫురణకు వచ్చేది భగవద్గీత. అయితే హైందవ ధర్మంలో మిగతా మతాలవలె ఒకే దేవుడు, ఒకే పూజా విధానము, ఒకే తీర్థయాత్రా స్థలం, ఒకే ప్రవక్త వంటి విధానం లేదు. అనేక దేవీ దేవతలు, పూజా విధానాలు, తీర్థయాత్రా స్థలాలు, ప్రవక్తలతో అత్యంత భిన్నత్వంతో హైందవ ధర్మం గోచరిస్తుంది. అందుకే హైందవాన్ని ఒక జీవన విధానంగా పండితులు అభివర్ణిస్తారు.
అయితే హిందువుల పవిత్ర గ్రంధంగా మనమంతా భావిస్తున్న భగవద్గీత వ్యాస విరచితమైన మహాభారతంలో ఒక చిన్న భాగం మాత్రమే. అంతేకాకుండా ఈ భగవద్ గీత ను వేదాంతంగా కూడా చెబుతారు. అంటే మరొక విధంగా చెప్పుకోవాలంటే భగవద్గీత ఉపనిషత్తుల సారాంశము. ఎందుకంటే ఉపనిషత్తులనే వేదాంతాలని కూడా పిలుస్తారు. అంటే ఉపనిషత్తులలోని ఆధ్యాత్మిక భావనలనన్నింటినీ క్రోడీకరించడం ద్వారా ఈ భగవద్గీత రూపుదిద్దుకుంది. అందుకే భగవద్గీత ఉపనిషత్తుల తోటలో నుండి గ్రహించబడిన రకరకాల పూలతో తయారుచేయబడిన ఒక పూల హుండీ వంటిదిగా అర్థం చేసుకోవచ్చు.
ఈ గీత అత్యంత సనాతనమైనదే కాకుండా విశ్వ జనీనమైనది కూడా. అందులో ‘కాఫిర్’ అనే పదానికి తావు లేదు. నా దారి రహదారి అనే కుశ్చితపు ఆలోచనలకు ఇది పూర్తిగా విరుద్ద్ధం.
అయితే ఈ భగవద్గీతను విశదీకరించి చెప్పేవారు కరువయ్యారు. చదవాలనే కుతూహలం ఉన్నవారు కూడా తక్కువే. ప్రజలకు ధర్మం గురించి తెలియజెప్పాల్సిన స్వామీజీలు, పూజారులు, పీఠాధిపతులు కులానికి, క్రతువులకు పెద్ద పీట వేసి రాయకీయ నాయకులతో స్నేహంచేస్తూ వారి ఆశ్రమాలను విస్తరించుకునే యావలో పడిపోయారు. తద్వారా హైందవ ధర్మ విశిష్టత గురించి ప్రజలకు చెప్పకుండా ధర్మాన్ని తమ గుప్పిట్లో ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
అందుకే ఈ భగవద్గీతను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకు వెళ్లాల్సిన బాధ్యతను ఇక సామాన్యులే తమ భుజస్కందాలపై వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతే కాకుండా దాన్ని సరళమైన పద్దతిలో అన్ని వర్గాల ప్రజలకు అర్ధమయ్యే విధంగా విశదీకరించే ప్రయత్నం చేయాలి. అప్పుడే అత్యంత ఉత్కృష్టమైన హిందూ ధర్మాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళగలం.