మళ్ళీ స్వదేశీ నినాదాలు ప్రతిధ్వనిస్తాయా?

కొన్ని సంవత్సరాల నుండి ప్రపంచీకరణ తిరోగమన మార్గం పట్టిందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే కరోనా మహమ్మారి ఆగమనం ఈ ప్రక్రియను వేగవంతం చేసింది. దేశాలు తమ సరిహద్దుల్ని సుదృఢం చేసుకుంటున్నాయి. స్వయం సమృద్ధిపై దృష్టి సారిస్తున్నాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతినుద్దేశించి నిన్న చేసిన ప్రసంగం భారత్ కూడా ప్రపంచీకరణను బుట్ట దాఖలు చేయడానికి సంసిద్దమౌతున్నదనే విషయాన్ని స్పష్టం చేసింది. మోడీ తన ప్రసంగంలో దేశంలో స్థానిక ఉత్పత్తి మరియు వినియోగాల ప్రాముఖ్యతను నొక్కి పలకడం ఎవరినీ ఆశ్చర్యానికి గురిచేయలేదు. దేశంలో మళ్ళీ స్వదేశీ నినాదాలు ప్రతిధ్వనించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్ధిక సామ్రాజ్య వాదం వెర్రితలలు వేస్తూ వర్ధమాన దేశాలను అతలాకుతలం చేస్తున్న ఈ దశలో, ఈ ఆర్ధిక జాతీయవాదం ఆహ్వానించదగ్గ పరిణామమేనని చెప్పుకోవాలి.

దేశీయ పరిశ్రమలని సుదృఢం చేయడం ద్వారా స్థానికంగా ఉత్పత్తిని పెంచడం, స్వయం సమృద్ధిని సాధించడం, దేశీయంగా ఉపాధి అవకాశాలను పెంచడం వంటి ఆలోచనలు ప్రపంచ వ్యాప్తంగా ప్రజల ఆదరణను చూరగొంటున్నాయి.

కమ్యూనిస్టు నియంతల పాలనలో ఉన్న చైనా ఈ ప్రపంచీకరణను అడ్డుపెట్టుకొని తనను తాను ఒక ప్రపంచ ఉత్పత్తి కేంద్రంగా మలచుకున్నది. కానీ ప్రజాస్వామ్యం ఏకోశానా లేని చైనా ఒక ప్రమాదకరమైన శక్తిగా అవతరించింది. కరోనా మహమ్మారి ఆ దేశంలో వుహాన్ నగరంలో పుట్టి ఎంతోమందిని బలితీసుకున్నప్పటికీ ఈ వ్యాధి తీవ్రతను, దాని అసలు స్వభావాన్ని ఎవరికీ తెలియకుండా దాచిపెట్టడం ప్రపంచానికి మింగుడుపడడం లేదు.

ఈ వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత వస్తుసేవల ఎగుమతి, దిగుమతులపై తీవ్రమైన ప్రభావం పడడం వల్ల అన్ని దేశాలు స్వావలంబన పై ద్రుష్టి సారిస్తున్నాయి.

మన దేశంలో 1991 లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆధ్వర్యంలో స్వదేశీ జాగరణ్ మంచ్ అనబడే ఒక సంస్థ స్థాపించబడింది. ఆ సంస్థ వస్తు సేవలని స్వదేశీయంగా ఉత్పత్తి చేసి వినియోగించడంపై ప్రజల్లో అవగాహన తీసుకు రావడానికి పెద్ద ప్రయత్నమే చేసింది. ఆ ప్రయత్నాన్ని అప్పట్లొ చాలామంది ఎద్దేవా చేయడమే కాక ఆ సంస్థను ఒక తిరోగమన శక్తిగా అభివర్ణించారు. ఇప్పుడు అదే స్వదేశీ నినాదం దేశ ప్రధాని నోటివెంట వెలువడింది.

ఆర్ధిక స్వావలంబన సాధించాలంటే దేశీయంగా పరిశోధన, అభివృద్ధి ని ప్రోత్సహించడమే కాకుండా నాణ్యమైన వస్తువుల్ని సాధ్యమైనంత తక్కువ ఖర్చులో ఉత్పత్తి చేయగలగాలి. అప్పుడే స్వదేశీ మన జీవితాల్లో ఒక భాగమవగలుగుతుంది.

ఈ కరోనా మహమ్మారి చైనా వాళ్ళ ప్రమాదకరమైన మనస్తత్వం మరియు సంకుచిత స్వభావాన్ని ప్రపంచం ముందు కళ్ళకు కట్టినట్లుగా ఆవిష్కరించింది. ఇక ప్రపంచం చైనా కమ్యూనిస్టు నియంతల మోసపూరితమైన మాటల్ని నమ్మే పరిస్థితిలో లేదు.

ప్రపంచీకరణ దిగుమతులకు ద్వారాలు బార్లా తెరిచేసి, విశృంఖల వినియోగాన్ని పెంచి, ప్రకృతిని నాశనం చేస్తూ మనుషుల్లో కృత్రిమత్వాన్ని పెంచింది. స్వదేశీ మనల్ని స్వీయ సంతృప్తితో కూడిన జీవన విధానం వైపుకు మళ్ళిస్తుంది.

ఈ కరోనా మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకున్నప్పటికీ, ప్రపంచంలో కొన్ని గుణాత్మకమైన మార్పులకు మార్గం సుగమం చేసిందని చెప్పుకోవాలి.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments