ఆధ్యాత్మికత అనేది అకస్మాత్తుగా లభించదు

Share:
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  
  •  

ఆధ్యాత్మికతను అలవరచుకోవాలని ఉత్సాహపడే వ్యక్తికి మొదట అది సులభమే అనిపిస్తుంది. కానీ ఆచరణలోకి వచ్చేసరికి అమితమైన కష్టంగా తోస్తుంది. అందువల్ల మధ్యలోనే వదలివేస్తారు. వేలాదిమందిలో ఏ ఒక్కరో, ఇద్దరో ప్రయత్నాన్ని విరమించకుండా సాధన చేస్తారు.

ఆధ్యాత్మికతను అందుకోలేకపోవడానికి గల ముఖ్య కారణాలలో అజ్ఞానం ఒకటి. అజ్ఞానం లో ఉన్న వ్యక్తికి ఆధ్యాత్మిక జ్ఞానం విలువ తెలియదు. జ్ఞానాన్ని, అజ్ఞానాన్ని విభజించుకుని చూసుకునే తెలివి కూడా ఉండదు. అందువల్ల ఆధ్యాత్మిక సాధనలో విఫలమవుతారు.

ఉదయం లేచింది మొదలు డబ్బు సంపాదనలో మునిగిపోతున్నాడు మనిషి. ఈ సంపాదన, కీర్తి ప్రతిష్టల కొరకు ప్రాకులాడడం, పదవీ వ్యామోహం… ఇదే భౌతిక వాదం. నిజమే మరి… డబ్బుకు అంత విలువ ఉన్నది. డబ్బు లేకపోతె జీవితాలు, కుటుంబాలు, దేశాలు కూడా ముందుకు సాగవు. వ్యక్తిగతంగా భార్యా పిల్లల పోషణ, కుమారుని చదువు, కూతురు వివాహము, నివాసయోగ్యమైన మంచి గృహ నిర్మాణం, గౌరవ ప్రదంగా జీవించాలనే తపన, ఇవన్నీ డబ్బుతోనే ముడిపడి ఉన్నాయి. ఇవి చిన్న విషయాలు కావు.

వీటి కోసం నిద్రలేచింది మొదలు పడుకోబోయేంత వరకూ సంపాదనలో మునిగి ఉండడం ఆధ్యాత్మికతను అందుకోవడానికి అవరోధాలుగా ఉంటాయి. అంతేకాక సంతానం కలిగిన నాటినుండీ తల్లి దండ్రులు వారి పిల్లల పెంపకంలో ఎంతో శ్రద్ధ వహిస్తారు. అలా శ్రద్ధ వహించడం మాత్రమే సరిపోదు. వారికి చిన్నప్పటి నుండీ సత్సంస్కారపూరితమైన ప్రవర్తన అలవరచుకునే విధంగా పెంచాలి. మన మాతృ దేశం యొక్క ఔన్నత్యాన్ని, మన హైందవ ధర్మం యొక్క ఔన్నత్యాన్ని గూర్చి చెప్పాలి. మన సంస్కృతీ గ్రంధాలైన భగవద్ గీత, ఉపనిషత్తులు, రామాయణ, మహాభారత, భాగవతాది హిందూ పవిత్ర గ్రంధాలలో ఉన్న విశిష్ట విషయాలను పిల్లలకు నేర్పాలి. కానీ దురదృష్ట వశాత్తు అది జరగడం లేదు.

మన దురదృష్టమేమిటంటే అవి నేర్పితే మన పిల్లలు ఎక్కడ సన్యాసుల్లో కలిసి పోతారో వాటి వల్ల నీతి వంతంగా పెరిగి ఎక్కడ ధన సంపాదనలో వెనుకబడి పోతారేమో అనే భావన ఈనాటి తల్లిదండ్రుల్లో ఏర్పడి పోయింది. పాస్చాత్య జీవన శైలిని అలవరచుకొనే విధంగా తమ పిల్లలను ఆ వైపుకు మళ్లిస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులకు భగవద్ గీత అనే ఆధ్యాత్మిక గ్రంధం ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఒకవేళ అది కనబడినా ఇది మనకేమర్థమవుతుందిలే అని దాని వంక కూడా చూడరు. కుటుంబం ఇలా ఉంటే ఇక ఆధ్యాత్మికత ఎలా అలవడుతుంది?

బాల్యమంతా చదువులో, ఆటపాటలలో గడిచిపోతుంది. యుక్తవయస్సు వచ్చేసరికి వివాహం, లైంగిక సుఖభోగాలలో తేలిపోవడం, సంతాన సాఫల్యం, ఆ తదుపరి భార్యా పిల్లల పోషణకు, వారి కోరికల్ని తీర్చడానికి ధన, కనక వస్తు సంపాదన వంటి వాటిలో కాలం గడిచి పోతుంది. క్రమంగా ముసలితనం మీద పడుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఆధ్యాత్మిక జీవనంలోకి ప్రవేశిద్దామనే కోరిక కలుగుతుంది. కానీ వయసు మళ్ళిన వారిని శారీరక రుగ్మతలు వేధిస్తూ ఉంటాయి. ఓపిక నశించి మనసును సరిగా నిలుపలేక పోతారు. గతాన్ని గురించిన చింతలు, భవిష్యత్తును గురించిన ఆందోళనలు బాధిస్తూ ఉంటాయి. వర్తమానంలో వృధా కాలయాపనల్లో మునిగి తేలుతారు.

అందుకే ఆదిశంకరాచార్య తాను రచించిన భజ గోవిందం లో ఈ శ్లోకాన్ని పొందుపరిచాడు.
బాలస్థావత్ క్రీడాసక్తహ్
తరుణస్థావత్ తరుణీసక్తహ్
వృధ్ధాస్తావాత్ చింతాసక్తహ్
పరమే బ్రాహ్మణి కో అపి న సక్తహ్

అంటే బాల్యమంతా ఆట పాటలలో గడిచిపోతుంది, యవ్వనమంతా స్త్రీ సంబంధమైన విషయాసక్తిలో మునిగి ఉంటాడు, ముసలితనంలో చింతలతో కుంగిపోతుంటాడు, పరభ్రహ్మము పై ఏ ఒక్కరూ శ్రద్ధ చూపడంలేదని అంటాడు. నిజమే కదా మరి?

మనిషికి నూరు సంవత్సరముల ఆయువు అందులో సగము నిద్రలో గడిచిపోతుంది. అందులోను సగము బాల్యము, ముసలితనములలో గడిచి పోతుంది. మిగిలిన సగం చింతలలోను, ప్రయాసలతోను కూడిపోతుంది. ఈవిధంగా ఆయువు క్షీణించి పోతుంటే మనుషులకు సుఖం ఎలాకలుగుతుంది అంటారు భర్త్రుహరి. అందుకే బొందిలో ప్రాణం ఉండగానే చిన్నవయసులోనే ఆధ్యాత్మిక జీవనం అలవరచుకోవలసిన అవసరం ఉన్నది.

మూఢనమ్మకాలు మనిషిని ఆధ్యాత్మికతకు దూరం చేస్తాయి. దీక్షలు, క్రతువులు, ఉపవాసాలు, బలుల వంటివి మానవులను అజ్ఞానంలోకి నెట్టివేసి భగవత్తత్వం వైపుకు పురోగమించనీయవు. సత్యశోధనే ఆధ్యాత్మికతకు మార్గదర్శిని అవుతుంది.

పేదరికం కూడా ఒకవిధంగా ఆధ్యాత్మిక జీవనానికి అడ్డంకిగా మారుతుంది. రోజంతా ఎక్కడ పని దొరుకుతుందా, ఏవిధంగా పొట్టపోసుకోవాలా అని ఆలోచించే వారికి భగవంతుడి మీదికి ద్రుష్టి మరలదు.

అహంకారం కూడా ఆధ్యాత్మిక జీవనానికి అడ్డు వస్తుంది. అంతా నాకే తెలుసుననే భావన వల్ల తెలుసుకోవాలనే జిజ్ఞాస నశించి సత్య శోధనా ప్రక్రియ నిలిచిపోతుంది.

 

 

 

journalist and a devotee

నమ్మకమే ఆధ్యాత్మికతకు మూలం

యోచనా శక్తి లేని కుక్కలే ఇంకొక కుక్క మీద నమ్మకంతో మొరిగాయి, అలాంటిది ఆలోచించే శక్తి ఉన్న మనుషులమైయుండి మనం మన పూర్వీకులను నమ్మలేమా!

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments