మంచి ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో అవసరం. వ్యాయామం లో కూడా నడక చాలా శ్రేష్టమైనది. ప్రాతఃకాల నడక మనకు ఆరోగ్యాన్నివ్వడమే కాకుండా ఆహ్లాదాన్ని కూడా ఇస్తుంది. ఉదయమే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని చల్లగా చిరుగాలి వీస్తుండగా ప్రాతః కాల నడకను మొదలుపెడితే ఆ నడక నుండి వచ్చే ఆహ్లాదాన్ని అనుభవించాల్సిందే కానీ చెప్పనలవి కాదు.
ఈ ఇరవైఒక్కటవ శతాబ్దంలో జబ్బు పడడానికి ముఖ్యమైన కారణం వ్యాయామ లోపమే. ఎప్పుడూ కదలకుండా కూర్చోవడం, అవసరమైన దానికన్నా ఎక్కువగా తినడం ఊబకాయానికి దారి తీస్తున్నాయి. ఈ ఊబకాయం రకరకాల అనారోగ్య సమస్యలకు కారణం అవుతున్నది. రక్తపోటు, చక్కెర వ్యాధి వంటి లైఫ్ స్టైల్ డిసీజెస్ కు కారణమవుతోంది. నడక రోగ నిరోధక శక్తిని పెంచడమే కాకుండా రోజంతా ఉత్సాహంగా, శక్తివంతంగా ఉండడానికి ఉపకరిస్తుంది.
ప్రస్తుత సమాజంలో యాంత్రీకరణ పెరిగిపోవడంతో ఒళ్ళు వంచి చేసే పనులు తగ్గిపోయాయి. కేవలం కంప్యూటర్ల ముందు గంటల తరబడి కూర్చొని పనిచేయవలసిన ఉద్యోగాలు పెరుగుతున్నాయి. ఇవి సెడెంటరీ లైఫ్‌స్టైల్ కు దారితీస్తాయి. పైగా జనాల్లో జిహ్వచాపల్యం పెరిగిపోయి రకరకాల హోటళ్లు, రెస్టారెంట్లు నుండి రకరకాల ఆహార పదార్థాలను తెప్పించుకుని తమకు అవసరమైనంతకంటే ఎక్కువ తినేయడం మొదలుపెట్టారు. ఈ విధంగా అవసరమైన దానికంటే ఎక్కువగా తినడం రక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం తక్కువగా తినడం మరియు వ్యాయామం పై దృష్టి పెట్టడం.
ఉదయాన్నే బయటకు వెళ్లి నడుస్తూ ఉంటే మనతోపాటు నడిచే వాళ్ళు చాలామంది కనిపిస్తూ ఉంటారు. చల్లటి గాలిలో, నీరెండలో నడుస్తుంటే ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఉదయం పూట వచ్చే నీరెండ నుంచి మనకు విటమిన్ డి పుష్కలంగా లభించడం వలన విటమిన్ డి లోపం నుండి మనం బయటపడవచ్చు. ఇక ఉదయమే నడుస్తున్నప్పుడు చక్కటి సంగీతం వింటూ ఉంటే ఇక ఆ అనుభవమే వేరు.
ఇక నడక మొదలుపెట్టాలనుకుంటే అందుకు అవసరమైన వస్తువులు కూడా సమకూర్చుకోవాలి. నడకకు ఉపయుక్తంగా, సౌకర్యంగా ఉండే షూస్, మనం వేస్తున్న అడుగులు, చేస్తున్న వ్యాయామాన్ని కొలవడానికి ఒక ఫిట్‌బిట్ వంటి వీరబుల్ డివైస్, సౌకర్యంగా ఉండే దుస్తులు, సంగీతాన్ని ఆస్వాదించడానికి ఒక మంచి హెడ్ ఫోన్.. ఇలా మన ప్రాధాన్యతలకు అనుగుణంగా కొన్నివస్తువుల్ని సమకూర్చుకొని మన నడకను, వ్యాయామాన్ని ఇంకా ఆహ్లాదకరంగా, సౌకర్యవంతంగా మలచుకోవచ్చు.
ఇన్ని బహుళ ప్రయోజనాలు ఉన్నటువంటి ప్రాతఃకాల నడకను మనలో చాలామంది ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? అందుకు ముఖ్య కారణం మనలో ఉన్నటువంటి బద్దకమే. ఒకసారి ఈ బద్ధకాన్ని వదిలించుకొని నడకను ప్రారంభిస్తే ఇక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకెందుకు ఆలస్యం, బద్దకాన్ని వదిలించుకొని మీ ప్రాతఃకాల నడకను ప్రారంభించండి.