ఆర్ధిక వ్యవస్థని గాడిలో పెట్టడమెలా?

0
419

కరోనా వైరస్ మహమ్మారి దేశంలో చొరబడిన తర్వాత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధంచడంతో పరిశ్రమలు మూతబడ్డాయి. జనాలంతా ఇళ్లకే పరిమితమవడంతో వ్యాపార లావాదేవీలు ఆగిపోయాయి. ఇక అసలే మాంద్యంలోకి జారుకుంటున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మూలిగే నక్కపై తాటికాయపడిన చందంగా పూర్తిగా స్తంభించిపోయే పరిస్థితికి వచ్చింది.

Embed from Getty Images

ఈ కొరోనావైరస్ ఎప్పటికప్పుడు తన రూపును మార్చుకుంటూ మరింత బలోపేతమవుతూ విజృంభిస్తున్నదనే వార్తల నేపథ్యంలో ఈ లాక్ డౌన్ మరింతగా పొడిగించే అవకాశమున్నదనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. భారత్ లో కొరోనా వైరస్ మూడవ దశ (కమ్యూనిటీ స్ప్రెడ్) లోకి ప్రవేశించిందన్న వార్తలు ప్రజల్లో భయాందోళనల్ని పెంచాయి.

ఈ లాక్ డౌన్ వల్ల పెద్ద ఎత్తున ప్రజలు ఉపాధి కోల్పోతుండడంతో ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టడానికి తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు బలంగా వినిపిస్తున్నాయి. ఆర్ధిక వ్యవస్థను గాడిన పెట్టాల్సిన అవసరమున్నదనే విషయం నిర్వివాదాంశమయినప్పటికీ ఆ పని ఎలాచేయాలన్నదే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రశ్న. ఈ ప్రశ్నకు ఎవరిదగ్గరా సరైన సమాధానం లేదు. కొందరేమో లాక్ డౌన్ ను ఎత్తేస్తే ఆర్ధిక వ్యవస్థ పుంజుకుంటుందంటున్నారు. కానీ ఆ పని చేస్తే కొరోనా వైరస్ మహమ్మారి పెద్ద ఎత్తున విరుచుకు పడే అవకాశముంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వైపు ఈ లాక్ డౌన్ ను ఇదేవిధంగా కొనసాగిస్తే ప్రజలు ఆకలికి అలమటిస్తారని, ఆకలి చావుకంటే కరోనా వైరస్ తో చావడమే మెరుగని అంటున్నారు. ఏమిచేయాలో దిక్కుతోచని పరిస్థితుల్లో మనుషుల జీవితాలు ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా తయారయ్యాయి.

ఇక గొప్ప పేరెన్నికగన్న ఆర్థికవేత్తలంతా ఒకే విషయం చెబుతున్నారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి భారీ స్థాయిలో ఉద్దీపన పథకాల్ని ప్రకటించాలంటున్నారు. ప్రజల చేతుల్లో నగదు బదిలీ పథకాల ద్వారా డబ్బులు పెట్టాలని సలహా ఇస్తున్నారు. ఈ విధంగా చేయడం ద్వారా ఉత్పత్తి రంగాన్ని ప్రోత్సహించడమే కాక ప్రజల్లో కొనుగోలు శక్తి పెంచినట్లవుతుందని అభిప్రాయపడుతున్నారు. డబ్బు అవసరమైనవారికి ఇవ్వడం ద్వారా వస్తు సేవలకు డిమాండ్ పెంచవచ్చని చెబుతున్నారు. అయితే ఇవన్నీ ఎంతవరకు సాధ్యమనే విషయంపై చర్చ జరుగుతున్నది.

అయితే భారీ స్థాయిలో ఉద్దీపన పథకాలు ప్రకటించడానికి, ప్రజలకు నగదు బదిలీలు చేయడానికి అవసరమైన ఆర్ధిక వనరులు మన ప్రభుత్వం వద్ద ఉన్నాయా అనేది ప్రస్నార్ధకం. ఆవిధంగా చేయాలంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున నగదును ముద్రించడమో లేదా అప్పు చేయడమో చేయాలి. నగదు ముద్రిస్తే అది ద్రవ్యోల్బణానికి దారితీసే అవకాశమున్నది. భారీగా అప్పులు చేస్తే అది పెద్ద ఎత్తున ద్రవ్య లోటు కు దారితీసే ప్రమాదమున్నది. కాబట్టి ప్రభుత్వాలు ఆచి తూచి అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తున్నది.

సలహాలిచ్చేవాళ్ళు సులభంగానే సలహాలిచ్చేస్తారు. ఎందుకంటే తదనంతర పరిణామాలకు వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం లేదు.
ఈ సందర్భాన్ని ఆసరాగా చేసుకొని తమను తాము మేధావులుగా చెప్పుకొనేవాళ్లు నోటికేదొస్తే అది మాట్లాడేస్తున్నారు. జనాలు లాక్ డౌన్ ను లెక్కచేయకుండా బయటికొస్తున్నారు అనే వార్తలు రావడంతోనే వీళ్లంతా ‘అయ్యో జనాలు బయటకొస్తున్నారా…ఇక మన దేశాన్ని ఆ దేవుడే కాపాడాలి’ అంటూ నిష్ఠూరం ఒలక బోస్తారు. అదే సమయంలో ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగిస్తే మళ్ళీ వీళ్ళే ‘అయ్యో లాక్ డౌన్ ను మళ్ళీ పొడిగించారా… ఇక జనాలు ఆకలితో చస్తారు’ అంటూ మళ్ళీ నిష్ఠూరం ఒలకబోస్తారు. ఈ విధంగా పలు నాలుకలతో అర్థం లేనట్లుగా మాట్లాడేవాళ్ల సంఖ్య ఎక్కువైపోయింది. అంతే కాకుండా ఏమాత్రం అర్థశాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్లుకూడా పెద్ద ఆర్ధిక వేత్తలవలె రక రకాల అభిప్రాయాలని వెలిబుచ్చుతున్నారు. ఏదేమైనా కొరోనా వైరస్ మహమ్మారి తెచ్చిన విపత్తు మానవాళికి పెద్ద గడ్డు పరిస్థితినే సృష్టించింది.

చాలా మంది మన భారత ప్రభుత్వం పేరెన్నిక గన్న భారత సంతతికి చెందిన ఆర్థిక వేత్తలైన అమర్త్య సేన్, అభిజిత్ బనెర్జీ, గీత గోపినాధ్ మరియు రఘురాం రాజన్ వంటి వారి సలహాలు తీసుకోవాలని అభిప్రాయ పడుతున్నారు. ఇది మంచి ఆలోచనే. అయితే పేరెన్నికగన్న ఆర్థికవేత్తలు ఎప్పుడూ బ్రహ్మాంఢమైన సలహాలే ఇస్తారని, వారి సలహాలకు తిరుగులేదని భావించడం మన అమాయకత్వమే అవుతుంది. 2008 లో వచ్చిన ప్రపంచ ఆర్ధిక సంక్షోభ సమయంలో బెన్ బెర్నాంకీ, అలన్ గ్రీన్స్పాన్ వంటి కొమ్ములు తిరిగిన ఆర్ధిక వేత్తలుకూడా సంక్షోభాన్ని పసిగట్టడంలో విఫలమయ్యారనే విషయాన్ని మనం మరచిపోకూడదు. అంతే కాకుండా సంక్షోభం నుండి గట్టెక్కడానికి ఆర్ధిక వేత్తలు ఇచ్చే సలహాలు గొప్ప ఫలితాలనిస్తాయనే హామీ కూడా లేదు.

ఇక ఇటివంటి గడ్డు పరిస్థితిలో మన కేంద్ర ప్రభుత్వం మాంద్యంలోకి జారిపోతున్న ఆర్ధిక వ్యవస్థను ఏవిధంగా గాడిలో పెడుతుందో వేచి చూడాల్సిందే.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments