రుచి, స్వచ్చతలకు మారు పేరు పుల్లా రెడ్డి నేతి మిఠాయిలు

0
733

మన తెలుగు రాష్ట్రాల్లో పుల్లా రెడ్డి నేతి మిఠాయిల గురించి వినని వారు లేరు అంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే, ఏ పండగొచ్చినా, ఎలాంటి ఆనంద సందర్భమైనా పుల్లా రెడ్డి స్వీట్స్ కొని అందరికి పంచటం ఒక ఆనవాయితీగా మారిపోయింది. ముఖ్యంగా హైద్రాబాద్ లో పుల్లారెడ్డి స్వీట్స్ షాప్ నగరానికే ఒక ప్రత్యేకతను తీసుకొచ్చి పెట్టింది. ఎవరైనా హైదరాబాద్ నుండి మిగిలిన ప్రాంతాలకి వెళ్లే వారు ఉంటె, ఖచ్చితంగా ఈ పుల్లారెడ్డి స్వీట్స్ కొని తీసుకువెళతారు. ఈ నేతి మిఠాయిలు నాణ్యత, స్వచ్ఛత అటువంటిది మరి. అలాంటి పుల్లారెడ్డి స్వీట్స్ గురించి మనము ఇంతవరకు వినని, చూడని ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి.

తిరుమల తిరుపతి దేవస్థానం వారిచే, మొట్ట మొదటి సారిగా శ్రీవారి గుడి వంట గదికి ఆహ్వానించబడినది పుల్లా రెడ్డి స్వీట్స్ షాప్. టీటీడీ వారు తాము భక్తులకి అందించే ప్రసాదాలు ఎక్కువ కాలం నిల్వ ఉండే విధంగా సూచనల కోసం పుల్లా రెడ్డి స్వీట్స్ వారిని ఆహ్వానించారు. ఇలా ఒక దేవస్థానం వారు ఒక స్వీట్స్ షాప్ వారిని ఆహ్వానించటం ఎంతో గౌరవప్రదమైనది. తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుల్లా రెడ్డి స్వీట్స్ కి ఇచ్చిన గౌరవం చాలా అరుదైనది. దాదాపు ఇది ఎవరికీ తెలియని నిజం.

ఎంతటి పెద్ద వ్యాపారం అయినా చిన్నగానే మొదలవుతుంది. పుల్లా రెడ్డి నేతి మిఠాయిల వ్యాపారం కూడా అలా మొదలైనదే. కర్నూల్ లోని గోకవరం అనే ఒక పల్లెటూరులో, సైకిల్ తొక్కుతూ తన భార్య తయారు చేసిన స్వీట్స్ ను అమ్ముతూ అంచెలంచెలుగా ఎదిగారు జి. పుల్లా రెడ్డి గారు. కసి రెడ్డి గారి గొప్ప సలహా మేరకు, పాత కర్నూల్ మార్కెట్ లో ఒక చిన్న స్వీట్ షాప్ పెట్టి తొలి అడుగు వేశారు.

భారత దేశం లో ఎక్కువశాతం స్వీట్ షాప్స్ ఉత్తర భారతదేశం నుండి వచ్చే వ్యాపారులు, అంటే ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ నుండి వచ్చినవారు ఉండేవారు. అంతే కాకుండా ముస్లిం వ్యాపారులు కూడా ఎంతో ఎక్కువ మంది ఉండేవారు. అలాంటి సమయం లో, ఆంధ్ర ప్రదేశ్ లో మొట్ట మొదటి సారిగా తెలుగు స్వీట్ షాప్ గా జి. పుల్లా రెడ్డి స్వీట్ షాప్ పేరు గడించింది. మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకమైన గుర్తింపు తేవడమే కాకుండా అప్పటివరకు వేరు వేరు ప్రదేశాల నుండి వచ్చిన మిఠాయి వ్యాపారులకు గట్టి పోటీని ఇచ్చింది పుల్లా రెడ్డి స్వీట్స్.

1954 సంవత్సరంలో పుల్లా రెడ్డి స్వీట్స్ రాష్ట్రపతి నివసించే రాజభవన్ కి అధికారికంగా స్వీట్స్ సరఫరా చేయటం ప్రారంభించింది.

1974 లో జి. పుల్లా రెడ్డి గారు RSS లో సంఘ్ చాలక్ గా చేరారు. తద్వారా 1975 లో ఆయన పుల్లారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించారు. కేవలం వ్యాపారం కే పరిమితం కాకుండా, దేశానికి ఉపయోగపడే సేవ చెయ్యాలనే తపన పుల్ల రెడ్డి గారిని ఆ స్థాయికి తీసుకొచ్చింది.

ఉడిపి పేజవర్ మట్ పుల్లా రెడ్డి గారికి ‘దానగుణ భూషణ’ అనే బిరుదును 1991 లో అందించారు. దాని మరుసటి సంవత్సరం లో ‘జమ్నాలాల్ బజాజ్’ అవార్డును వారు చేసే నిజాయితీ గల వ్యాపారానికి నిదర్శనంగా పొందారు.

దేశం మొత్తం దాదాపుగా 18 దుకాణాలు ఉన్నాయి, అందులో ఎనిమిది హైదరాబాద్ లో, 4 కర్నూల్ లో, ఆరు బెంగుళూరు లో. పుల్లా రెడ్డి నేతి మిఠాయిలు ఇప్పుడు అమెరికా లో కూడా లభిస్తున్నాయి.

కేవలం స్వీట్ షాప్ కాకుండాహైదరాబాద్ లో పుల్లారెడ్డి కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ మరియు, జి. నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ను స్థాపించారు.

పుల్లా రెడ్డి స్వీట్స్ ను స్థాపించిన జి పుల్లారెడ్డి గారు ఏవిధమైన ఉన్నత విద్య చదువుకోలేదు. అయినప్పటికీ భారతదేశంలో విజయవంతమైన కొద్ది వ్యాపారవేత్తలలో ఒకరిగా నిలిచారు.

మనందరికీ పుల్లా రెడ్డి స్వీట్స్ గురించి ఎన్నో తెలియని అద్భుతమైన నిజాలు తెలిసాయి. అయితే, వీటి అన్నింటిలో వ్యాపారం పట్ల ఆయనకీ ఉన్న క్రమశిక్షణ, అంచెలంచెలుగా ఎదిగే తత్త్వం కనపడుతున్నాయి. ఎంత ఎత్తుకి ఎదిగినా, ఒదిగి ఉండగలిగే స్వభావం వల్ల ఆయనకు ఎన్నో గౌరవ సత్కారాలు లభించాయి. ఎవ్వరికీ అందని గౌరవ బిరుదులూ పొందారు. అంతటి తో ఆగకుండా సమాజం పట్ల ఆయనకి ఉన్న శ్రద్ధను పనుల రూపంలో చూపించి అందరికి వీలైనంత మంచిని చేసే ప్రయత్నం చెయ్యటం లో ఆయన పూర్తిగా విజయం సాధించారు. సమాజ సేవా తత్పరుడిగానే కాకుండా, ఆధ్యాత్మిక వేత్తగా, హిందూ జాతీయ వాదిగా కూడా ఖ్యాతి గడించారు. వ్యాపారం ద్వారా గొప్ప స్థాయికి ఎదిగి, సేవాభావంతో సమాజం పట్ల గౌరవ భావంతో ఆయన మెలిగిన తీరు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచింది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments