సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న పాత్రికేయ రంగం

0
447

మానవాళిని కరోనా వైరస్ మహమ్మారి పట్టి పీడించడం మొదలుపెట్టిన తర్వాత దాని ప్రతికూల ప్రభావం ఎన్నో సంస్థల పైన వ్యాపారాల పైన పడింది. అందులో అతి ముఖ్యమైనవి వార్తా సంస్థలు. ఎలక్ట్రానిక్ మీడియా ఫర్వాలేదు అనిపించినప్పటికీ వార్తా పత్రికలు తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఎందుకంటే మొదట్లో కరోనా వైరస్ వార్తా పత్రికల ద్వారా కూడా వ్యాపిస్తుందని ప్రచారం జరగడంతో ప్రజలు వార్తాపత్రికలకు దూరంగా ఉన్నారు.

చందాదారుల సంఖ్య తగ్గిపోవడంతో వార్తా పత్రికల మనుగడ కష్టసాధ్యంగా తయారయింది. చదువరులు కూడా వార్తా వెబ్సైట్ల వంటి డిజిటల్ మాధ్యమాల వైపుకు ఆకర్షితులవుతున్నారు. ఇక చాలా పత్రికలు ఆదాయం కోసం స్పాన్సర్డ్ కంటెంట్ను ప్రచురిస్తున్నాయి. ఇందువల్ల వార్తలకు వ్యాపార ప్రకటనలకు తేడా తెలియకుండా పోయింది. ఇక వార్తా పత్రికలు, టెలివిజన్ చానళ్లు తమ మనుగడ కోసం వ్యాపార సంస్థల పై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇందువల్ల ఆ సంస్థల యొక్క స్వేచ్ఛ, స్వయం ప్రతిపత్తి పై ప్రతికూల ప్రభావం పడి వాళ్లు పాత్రికేయ విలువలకు తిలోదకాలు ఇచ్చే ప్రమాదం ఉంది.

పత్రికలను ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభం గా ప్రజాస్వామ్యవాదులు అభివర్ణిస్తారు. ఈ నేపథ్యంలో వార్తా సంస్థలకు ఇటువంటి పరిస్థితి దాపురించడం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టుగా భావించాల్సి ఉంటుంది. ముందు ముందు చాలా వార్తా పత్రికలు తమ పేపర్ ఎడిషన్ లను ఆపివేసి కేవలం వెబ్సైట్లు మాత్రమే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చాలా వార్తా సంస్థలు తమ వెబ్సైట్లలో కంటెంట్ ను పే వాల్ వెనుకకు నెట్టివేసి చదువరులను చందా దారులుగా చేరాల్సిందిగా కోరుతున్నాయి. ఇక నుండి ఏదైనా వార్తాపత్రిక వెబ్సైటు ను సందర్శించి వార్తలను చదవాలి అంటే మనం చందాదారులుగా చేరాల్సిన అవసరం ఉంటుందేమో.

ఇక ట్విట్టర్ వంటి మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ వచ్చిన దగ్గరనుండి చాలామంది ప్రజలు వార్తల కోసం ఈ వెబ్సైట్లపై కూడా ఆధారపడుతున్నారు. ఎందుకంటే అన్ని ప్రభుత్వ మరియు ప్రయివేటు సంస్థలు, ప్రభుత్వాధినేతలు ట్విట్టర్ లో క్రియాశీలకంగా ఉన్నాయి. ఈ సంస్థలు, అధినేతలు తమ విధానపరమైన నిర్ణయాలు కూడా ట్విట్టర్ పై ప్రకటిస్తూ ఉండటంతో ప్రజలు ఈ మైక్రో బ్లాగింగ్ వెబ్సైట్ల పై దృష్టి పెడుతున్నారు. మనుగడ కోసం పోరాటం పెరిగిపోవడంతో చాలా వార్తా సంస్థలు సంచలనాత్మకమైన కథనాలపై దృష్టి పెడుతున్నాయి.

ఇకముందు చదువరులు వార్తల కోసం డిజిటల్ మాధ్యమాల పైనే ఆధారపడే సూచనలు కనిపిస్తుండడంతో ఇబ్బడి ముబ్బడిగా కొత్త వెబ్సైట్లు పుట్టుకొస్తున్నాయి. ఈ పరిస్థితి ఎక్కడికి దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments