ఇశ్రాయేల్, యూఎఈ ల మధ్య శాంతి ఒప్పందం

0
41

ఇస్లామిక్ దేశాలు ఇశ్రాయేల్ పేరు వినగానే ఒంటికాలి మీద లేస్తాయి. ఇశ్రాయేల్ జియానిస్ట్ దేశమని, పాలస్తీనా పై అకృత్యాలు చేస్తున్నదనీ రకరకాలుగా నిందిస్తారు. ఆ దేశాన్ని ప్రపంచపటం నుండి తుడిచిపెట్టడానికి ఇస్లామిక్ దేశాలు చేయని ప్రయత్నం లేదు.

ఈజిప్టు, జోర్డాన్ మరియు సిరియా లు ఇశ్రాయేల్ ను తుడిచిపెట్టాలనే దుష్ట సంకల్పంతో 1967 లో ఆ దేశం పై దాడి చేసాయి. అప్పుడు జరిగిన ఆరు రోజుల యుద్ధంలో ఇశ్రాయేల్ సంఖ్యా పరంగా, ఆయుధ సంపత్తి దృష్ట్యా తమకన్నా మిన్నగా ఉన్న అరబ్ సైన్యాలను తుత్తునియలు చేసి తరిమికొట్టింది. అంతే కాకుండా తమపై దండెత్తిన అరబ్ దేశాల భూభాగాలను కొంతవరకూ ఆక్రమించి తమ దేశ భద్రతను మరింత సుదృఢం చేసుకున్నది.

ఇక అప్పటినుండి అరబ్ దేశాలు ఇశ్రాయేల్ ను ఏమీ చేయలేక ఇస్లామిక్ ఉగ్రవాదులను ఆ దేశంపైకి ఎగదోస్తూ, అంతర్జాతీయ వేదికలపై ఇశ్రాయేల్ పై మానవ హక్కుల ఉల్లంఘనకు పాలుపడుతోందంటూ విమర్శలు చేస్తూ తమ అక్కసు వెళ్లగక్కుతున్నాయి.

ఇశ్రాయేల్ చిన్న దేశమైనా గొప్ప దేశం. శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇతర దేశాలు ఈర్ష్య పడదగిన ప్రగతి సాధించింది. ఎడారిని సస్యశ్యామలం చేసింది. ఇవ్వాళ అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇశ్రాయేల్ సాంకేతిక పరిజ్ఞానం కోసం అర్రులు చాస్తున్నాయంటే వాళ్ళు ఎంత శక్తివంతులో అర్థం చేసుకోవచ్చు.

అటువంటి శక్తివంతులైన వారితో చేతులు కలపడానికి ఎవరైనా ఉత్సాహం చూపిస్తారు. ఈ మధ్యనే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఇశ్రాయేల్ తో శాంతి ఒప్పందాన్ని చేసుకొని ఆ దేశంతో దౌత్య సంబంధాల్ని ఏర్పాటు చేసుకున్నది. ఈ విషయం నచ్చని పాకిస్తాన్, టర్కీ వంటి మత మౌఢ్య దేశాలు యూఎఈ నిర్ణయాన్ని విమర్శిస్తున్నాయి. పాకిస్తాన్, కతర్, టర్కీ వంటి దేశాలు ఇస్లాం ను అడ్డం పెట్టుకొని ఉగ్రవాదాన్ని ఎగదోయడం ద్వారా పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయనే విషయం జగమెరిగిన సత్యం.

ఇశ్రాయేల్ భారత్ కు మంచి మిత్రదేశం. ఎన్నో క్లిష్ట పరిస్థితుల్లో భారత్ కు అండగా నిలిచింది. రక్షణ, శాస్త్ర సాంకేతిక మరియు ఆర్ధిక రంగాల్లో సహకారం పెరగడంతో ఇరుదేశాల మధ్య మిత్రత్వం వెల్లివిరిసింది. ఇశ్రాయేల్ భారత్ కు రెండవ అతిపెద్ద ఆయుధాల సరఫరా దారుగా (రష్యా తర్వాత) అవతరించింది. ఎప్పుడు భారత్ కు సరిహద్దుల్లో విపత్తు వచ్చినా మీకు మేమున్నామంటూ స్పందించింది. అందుకే భారతీయులు ఇశ్రాయేల్ అంటే అభిమానం చూపిస్తున్నారు.

ఇశ్రాయేల్ మరియు యూఏఈ ల మధ్య కుదిరిన శాంతి ఒప్పదం ఒక మైలురాయిగా నిలిచిపోతుంది. ఎందుకంటే సాధారణంగా అరబ్ దేశాలు ఇశ్రాయేల్ను అస్థిరత్వం పాలు చేయడానికి శతవిధాలా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూఏఈ తన శత్రుత్వాన్ని ప్రక్కనబెట్టి ఇశ్రాయేల్ తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ప్రయత్నించడం హర్షిచదగిన పరిణామం.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments