చూస్తూ చూస్తూ ఉండగానే మరో కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. 2020 సంవత్సరంలో ప్రజలు చాలా వరకు ఇళ్లలోనే ఉన్నారు. చైనా వైరస్ భయంతో ప్రజలు ఇంటిపట్టున ఉండడంతో ఆర్థిక కార్యకలాపాలు మందగించి పోయాయి. చాలా వ్యాపారాలు మూత పడిపోయాయి. ప్రజలు నానా ఇక్కట్లు పడ్డారు. ఒక విధంగా చెప్పుకోవాలంటే 2020 వ సంవత్సరం ప్రజలకు ఒక పెద్ద పీడ కలగానే మిగిలిపోయింది.
ఈ వైరస్ బారిన పడి లక్షలాదిమంది చనిపోవడమేకాకుండా చాలామంది తీవ్రమైన అనారోగ్యానికి గురయ్యారు. ఇక ప్రజలంతా ఈ చైనా వైరస్ నుంచి ఎప్పుడు విముక్తి లభిస్తుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. పరిస్థితులు మెరుగు పడుతున్నాయని వార్తలు వస్తూ ఉండగానే ఈ వైరస్ ప్రమాదకరంగా రూపాంతరం చెంది మళ్లీ విజృంభిస్తున్నదనే వార్తలు గుప్పుమన్నాయి. చాలా ఐరోపా దేశాలు మళ్లీ లాక్డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి అనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళనలు మళ్లీ పెచ్చరిల్లుతున్నాయి. ఈ రూపాంతరం చెందిన వైరస్ మొదటిగా బ్రిటన్ లో కనిపించింది. అయితే ఈ కొత్త వైరస్ మునుపటికన్నా వేగంగా వ్యాప్తి చెందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
సహజంగా కొత్త సంవత్సరం మన అందరి జీవితాల్లో కొత్త ఆశలను చిగురింప చేస్తుంది. ఈ కొత్తసంవత్సరంలోనైనా ఈ చైనా వైరస్ ముప్పు తప్పి పోతుంది అని ఆశిద్దాం. జనజీవనం మళ్లీ గాడిలో పడి ఆర్థిక వ్యవస్థలు మరలా పుంజుకుని ప్రజల కష్టాలు తీరుతాయని ఆశిద్దాం.
వివిధ దేశాలు వివిధ రకాల వాక్సిన్ లను ఆవిష్కరిస్తున్నప్పటికీ అవి ఎంతవరకు సమర్థవంతంగా పనిచేస్తాయి, ఎంతవరకు సురక్షితం అనే విషయాలపై రకరకాల అనుమానాలు ఉన్నాయి. అంతేకాకుండా దాదాపు 130 కోట్ల పైగా జనాభా ఉన్న భారతదేశంలో ప్రజలందరికీ ఈ చైనీస్ వైరస్ వ్యాక్సిన్ ఇవ్వడం సాధ్యమవుతుందా అనే విషయంపై కూడా చర్చ జరుగుతోంది. ఎందుకంటే పోలియో వ్యాక్సిన్ను పిల్లలందరికీ అందించి పోలియో ను దేశం నుండి తరిమి కొట్టడానికి మన దేశానికి కొన్ని దశాబ్దాలపాటు పట్టింది. మరి చైనా వైరస్ వ్యాక్సిన్ ని ప్రజలందరికీ అందించడానికి ఇంకెన్ని దశాబ్దాలు పడుతుందో, ఈ లోగా ఈ వైరస్ ఎన్నిసార్లు రూపాంతరం చెంది ఎంత ప్రమాదకరంగా పరిణమిస్తుందో వేచిచూడాల్సివుంది.
ఏదేమైనప్పటికీ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. నిర్లక్ష్యాన్ని ప్రక్కనబెట్టి, పరిశుభ్రత పాటిస్తూ ఈ వైరస్ బారినుండి తమను తాము రక్షించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలను తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉన్నది.