నవంబర్ 26 ముంబై మారణహోమం జరిగి 12 సంవత్సరాలు కావస్తున్నది. పాకిస్థాన్ లో శిక్షణ పొందిన ఇస్లామిక్ ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి విచక్షణారహితంగా కాల్పులు జరపడం ద్వారా ఎంతోమంది అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్నారు. ఈ ఇస్లామిక్ ఉగ్ర దాడికి తెగబడిన ముష్కరులు హిందువుల వలె తమ చేతులకు కాషాయ దారాలు కట్టుకొని హిందూ గుర్తింపు కార్డులతో దేశంలోకి ప్రవేశించారు.
ఈ మారణ హోమానికి దేశం వెలుపలనుండే కాకుండా దేశం లోపలినుండి కూడా పెద్ద కుట్ర జరిగింది అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలీ దాడి అంతా కూడా హిందువులే చేశారనీ, ఇదొక ‘హిందూ టెర్రర్’ దాడి అనే కట్టు కథను సృష్టించి దేశంలో హిందూ సమాజం పై టెర్రరిస్టులుగా ముద్రవేసే కార్యక్రమంలో భాగంగానే ఆ మారణహోమం జరిగింది.
అయితే ఈ ఉగ్ర ముష్కరులలో ఒకరైన అజ్మల్ కసబ్ అనబడే టెర్రరిస్టును తుకారాం ఓంబ్లే అనబడే ఒక పోలీస్ అధికారి ప్రాణాలకు తెగించి సజీవంగా పట్టుకోవడంతో వాళ్ల కుట్రలు విఫలమయ్యాయి. ఈ ప్రయత్నంలో తుకారాం ఓంబ్లే తన ప్రాణాన్ని త్యాగం చేసి దేశ ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచిపోయారు. అజ్మల్ కసబ్ ను కనుక సజీవంగా పట్టుకోకపోయి ఉన్నట్లయితే దేశంలో పత్రికలవాళ్ళు, కమ్యూనిస్టులు, ఇస్లామిస్టులు, అందరూ కూడబలుక్కొని ముంబై దాడులను ఒక హిందు టెర్రరిస్టు దాడిగా చిత్రీకరించడంలో సఫలీకృతులు అయి ఉండేవారేమో.
ఇక ఈ దాడి తరువాత ఇది ఒక ఇస్లామిక్ ఉగ్రదాడి గా పూర్తిగా నిరూపించబడిన తరువాత కూడా దిగ్విజయ్ సింగ్, మహేష్ భట్ వంటి వాళ్ళు ఈ దాడిని హిందు ఉగ్ర దాడిగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. ముంబైలో జరిగిన టెర్రరిస్టు దాడి ప్రపంచం లో జరిగిన అత్యంత క్రూరమైన, హేయమైన ఇస్లామిక్ టెర్రరిస్టు దాడుల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ దాడిని దేశంలో ప్రజలు ఎప్పటికీ మర్చిపోకూడదు. ఎందుకంటే ఇస్లామిక్ తీవ్రవాదం కోరలు చాస్తూ తమ పరిధిని విస్తరించుకుంటూ ప్రపంచవ్యాప్తంగా తమ హింసాయుత కార్యకలాపాలను కొనసాగిస్తున్నది.
ఈ మధ్యనే వివిధ ఐరోపా దేశాల్లో ముఖ్యంగా ఫ్రాన్స్‌లో జరిగిన శిరో ఖండనలను మనం గమనిస్తే ఇస్లామిక్ ఉగ్రవాదం ఏ స్థాయిలో విస్తరిస్తున్నదో మనకు అర్థమవుతుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇస్లామిక్ ఉగ్రవాదం పట్ల అప్రమత్తంగా ఉంటూ ముంచుకొస్తున్న ఈ ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సమిష్టి కృషి సల్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.