మా నాన్నగారు అప్పుడప్పుడూ తన బాల్యపు జ్ఞాపకాలను పంచుకుంటూ తన చిన్నతనంలో తానేం తినేవాడో చెప్పేవారు. మా జేజినాన్న ఒక సామాన్య రైతు. ఆయనకున్న ఒక చిన్న కమతంలో వ్యవసాయం చేసేవాడు. మా నాన్న ప్రభుత్వోద్యోగం చేసినప్పటికీ ఆయనకు కూడా వ్యవసాయం చేసిన అనుభవం ఉన్నది. నాకు మాత్రం వ్యవసాయానుభవం లేదు.
మానాన్నగారు తన చిన్నతనంలో జొన్న అన్నం తినేవారట. నేనుకూడా నా బాల్యంలో అప్పుడప్పుడూ మా నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినపుడు జొన్న అన్నం రుచిచూసాను. జొన్న అన్నం, ముద్దపప్పు, ఆవకాయపచ్చడి, బోలెడంత నెయ్యి ఆరోజుల్లో రోజువారీ ఆహారం. వరన్నం ఆరోజుల్లో బాగా డబ్బున్నవాళ్ళే తినేవాళ్లు. మా నాన్నగారు ఆరోజుల్లో తాను వరన్నంతోబాటుగా చిరుధాన్యాలుగా చెప్పబడే కొర్రలు, ఆరికలు, సామలు, వరిగలు తో వండిన అన్నం కూడా తినేవారట. అయితే ఆ ధాన్యాల పేర్లు మా నాన్నగారు చెబుతుంటే వినడమేకానీ ఎప్పుడూ చూసి ఎరుగను.
కానీ ఈమధ్య ఈ చిరుధాన్యాలు మళ్ళీ వెలుగులోకి వస్తున్నాయేమోననిపిస్తున్నది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చాలామంది ఈ చిరుధాన్యాల సుగుణాలగురించి విని వాటిని తినడానికి సిద్ధపడుతున్నారు. ఈ ధాన్యాలలో పీచుపదార్థాలు, మాంసకృత్తులు ఎక్కువ శాతంలో ఉండడమే కాక చెక్కెర వ్యాధితో బాధపడేవారికి చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతూండడంతో చాలామంది వీటి వైపు మొగ్గుచూపుతున్నారు.
ప్రస్తుతం వ్యాయామ లేమివల్ల ఊబకాయంతో బాధపడేవారి సంఖ్య పెరిగిపోయి బరువెలాతగ్గాలా అని మధనపడేవారి సంఖ్యకూడా పెరుగుతున్నది. ఈ చిరుధాన్యాలు బరువు తగ్గడానికి కూడా ఉపకరిస్తాయని ప్రచారం జరుగుతూండడంతో వీటికి డిమాండ్ బాగా పెరుగుతున్నది.
ఈ ధాన్యాలు ఎటువంటి రసాయనిక ఎరువులు, పురుగుమందులు ఉపయోగించకుండా పండిస్తారని, అందువల్ల అవి ఆరోగ్యానికి ఎటువంటి హానిచేయవనే ఆలోచన వినియోగదారుల్లో బలంగా ఉన్నది. పైగా ఈ ధాన్యాలు గడ్డి జాతికి చెందినవి కావడంతో ఎక్కు నీళ్లు లేకుండానే పండించడానికి వీలవుతుంది కాబట్టి వర్షాభావ ప్రదేశాల్లో కూడా వీటిని పండించడం ద్వారా రైతులు ఆదాయాన్ని పొందవచ్చని ప్రచారం కూడా జరుగుతున్నది.
అయితే వరన్నంతో పోల్చుకుంటే వీటి అన్నం రుచి తక్కువని చాలామంది భావిస్తుండడంతో రుచిని కోరుకునేవారు వీటిని తినడానికి ఇష్టపడడంలేదు. ఈరోజుల్లో రెస్టారంట్ ఆహారానికి అలవాటుపడి రకరకాల రుచులకు ప్రాధాన్యతనిచ్చే వారికి వీటి రుచి అంత సులభంగా నచ్చకపోవచ్చు. ఏదేమైనా బహుళ ప్రయోజనాలున్న ఈ చిరుధాన్యాలను ప్రజలు ఎక్కువగా వాడి ఆరోగ్యాన్ని పొందితే అంతకన్నా ఇంకేంకావాలి.