కరోనా వైరస్ రోగులతో ఆసుపత్రులు నిండిపోతున్నాయి. ప్రజల్లో కూడా బాధ్యతా రాహిత్యం పెరిగిపోయింది. కనీసం మాస్కులు కూడా సరిగా ధరించకుండా నిర్లక్ష్యన్గా తిరుగుతున్నారు. మొదట్లో ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కరోనా వైద్యం అందించారు. ఇక తమ వల్ల కాకపోవడంతో ప్రభుత్వాలు ప్రయివేటు ఆసుపత్రులకు కూడా కరోనా వైద్యం అందించడానికి అనుమతించాయి. ఇక ఇదే అదనుగా భావించి ప్రయివేటు ఆసుపత్రులు రోగుల్ని పీక్కు తినడం మొదలుబెట్టాయని వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం చేతులెత్తేసిందనీ, ప్రయివేట్ ఆసుపత్రులు డబ్బులు దండుకుంటున్నాయనీ వార్తలు గుప్పుమనడంతో జనాలు భయభ్రాంతులకు గురవుతున్నారు.
ఇటువంటి కీలక సమయంలో గ్లెన్మార్క్ అనబడే భారత ఔషధ తయారీ సంస్థ ఫావిపిరావిర్ అనబడే యాంటీవైరల్ మందును మార్కెట్లోకి విడుదల చేయబోతోందనే వార్త కొంత ఉపశమనాన్ని కలిగిస్తున్నది. ఈ మందు మూడు దశల్లో క్లినికల్ ట్రైల్స్ పూర్తిచేసుకున్నదనీ దీని విడుదలకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ అఫ్ ఇండియా (డీ జీ సి ఏ) ఇటీవలే అనుమతి మంజూరు చేసిందనీ ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఈ మందు తేలికపాటి నుండి ఒక మోస్తరు కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ బారిన పడిన వారికి ఉపయుక్తంగా ఉంటుందనీ, ఈ మందును వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఆధారంగా విక్రయిస్తారనీ వార్తలు వస్తున్నాయి.
Glenmark becomes the first pharmaceutical company in India to receive regulatory approval for oral antiviral Favipiravir, for the treatment of mild to moderate COVID-19 . pic.twitter.com/tcOFxNWwWL
— Ashish Chaturvedi (@AshishZBiz) June 20, 2020
అయితే ఈ మందు ధర చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. 200 మిల్లీగ్రాముల టాబ్లెట్ ధరను 103 రూపాయలుగా నిర్ణయించారట. 34 టాబ్లెట్ లు ఉండే స్ట్రిప్ ను కొనుగోలు చేయడానికి 3500 రూపాయలు వెచ్చించాల్సి ఉంటుంది. ఈ మందును పది నుండి పధ్నాలుగు రోజులపాటు వాడవలసి రావచ్చని, అందుకయ్యే ఖర్చు 14, 000 రూపాయలవరకూ ఉంటుందనీ అంచనా వేస్తున్నారు. ఈ మందును డయాబిటీస్ వంటి కొమోర్బిడిటీ కండిషన్స్ తో బాధపడుతున్నవారు కూడా వాడవచ్చని చెబుతున్నారు. ఈ టాబ్లెట్స్ వచ్చే పది రోజుల్లో దేశవ్యాప్తంగా ఔషధ దుకాణాల్లో అందుబాటులోకి వస్తాయంటున్నారు.
ఈ మందు 80 శాతం పైగా రోగుల్లో వైరల్ లోడ్ ను తగ్గించి ఉపశమనాన్ని కలిగిస్తుందని గ్లెన్మార్క్ సంస్థ చెబుతున్నది. దేశం మొత్తం భయంతో విలవిలలాడుతూ, ఈ సంకట స్థితినుండి ఎలా బయట పడాలో తెలియక సందిగ్ధంలో ఉన్న ఈ సమయలో ఈ మందు రాబోతున్నదనే విషయం ఒకింత స్వాతన కలిగిస్తున్నది.