కోవిద్ కరువు కాలంలో అదుపులేని సారాయి

0
8

కొరోనా వైరస్ భయంతో జనాలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. లాక్డౌన్ మూలంగా ఆర్ధిక వ్యవస్థ తిరోగమన మార్గం పట్టిందని అందరూ ఆందోళన చెందుతున్నారు. తమ ఉద్యోగాలు పోతాయేమోనని చాలామంది భయపడుతున్నారు.

అయితే ఎవరిగోల వారిది అన్నట్లుగా మందు బాబులు మాత్రం ఈ భయాలన్నీ వదిలేసి మందే పరమార్థం అన్నట్లుగా మందుసీసాలు కూడా బ్లాక్ లో కొంటూ తమ దురలవాటును అప్రతిహతంగా కొనసాగించారు.

ఇక ఆర్ధిక వ్యవస్థ కుదేలయిపోవడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు బొత్తిగా ఆదాయం లేకుండా పోవడమే కాక, కొరోనావైరస్ ను అదుపుచేయడానికవుతున్న విపరీతమైన ఖర్చు తలకు మించిన భారమవుతున్నట్లుగా ఉన్నది. కనీసం సారాయి దుకాణాలు తెరిస్తేనన్నా తమకు ఒకింత ఆదాయం వస్తుందనుకున్నారేమే. ఆలోచన వచ్చిందే తడవుగా దుకాణాలు తెరిచేసారు.

మరొక ముఖ్య విషయమేమిటంటే ఒకసారి సారాయికి అలవాటుపడిన తర్వాత అది ప్రతిరోజూ ఉండాల్సిందే. ఈ లాక్ డౌన్ కారణంగా ఒకేసారి మందు దొరకడం ఆగిపోవడంతో మందుబాబులకు పిచ్చెత్తిపోయినట్లుగా అయిపొయింది. విత్డ్రాయల్ సింటమ్స్ పెరిగిపోయి వాళ్ళ జీవితాలు నరకప్రాయమైపోయాయి. చాలామంది మానసిక వైద్యుల వద్ద వైద్యం కూడా పొందినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో మందుబాబులు సారాయి దుకాణాలు ఎప్పుడెప్పుడు తెరుస్తారా అని ఆబగా ఎదురుచూసారు.

ఇంకేముంది దుకాణాలు తెరవగానే మందుబాబులంతా కిలోమీటర్ల పర్యంతం క్యూలుకట్టారు.
చాలా ప్రదేశాల్లో ఆడవాళ్లు కూడా మేమేమాత్రం తీసిపోమన్నట్లుగా క్యూలు కట్టారట. ఇక మందు బాబులు తలుచుకుంటే ప్రభుత్వాలకు ఆదాయం కొదవా అన్నట్లుగా మొదటి రోజే ప్రభుత్వాలకు బంపర్ ఆదాయం వచ్చింది.

అయితే అసలు సమస్యేమిటంటే ఈ కొరోనావైరస్ వల్ల స్వీయ నియంత్రణ పాటించాల్సిన ఈ సమయంలో మందు బాబులు సోషల్ డిస్టెన్సిన్గ్ ను మరచిపోయి ఒకరినొకరు అతుక్కొని, ఒకరినొకరు తోసుకుంటూ లైన్లలో నిలబడుతున్నారు. ఈ వ్యవహారం చూసిన వారంతా ఔరా అంటూ ముక్కున వేలేసుకుంటున్న పరిస్థితి. ఇక ఈ ‘మందు లైన్లు’ మరో కొరోనావైరస్ హాట్స్పాట్లుగా మారకముందే ప్రభుత్వాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

మరొక విషయమేమిటంటే లాక్డౌన్లు పెట్టినదగ్గరనుండీ ఇళ్లలో గృహహింస పెరిగిపోయిందని చాలా మంది పరిశీలకులు చెబుతున్నారు. ఇక సారాయి దుకాణాలు తెరవడంతో మందుబాబులు డబ్బులకోసం కుటుంబసభ్యలని వేధించడమే కాక సారాయి మత్తులో ఇళ్లలో ఆడవాళ్ళని, పిల్లల్నీ ఇంకా హింసిస్తారేమో అనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అంతే కాకుండా అసలే ఆర్థికంగా చితికిపోయి ఉన్న పేద దిగువమధ్యతరగతి కుటుంబాలు ఇంకా సమస్యల్లో ఇరుక్కుపోయే అవకాశం ఉన్నదనే భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఏదేమైనా ఈ సారాదుకాణాలు తెరవడం అన్ని విధాలుగా నష్టమే చేకూరుస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వాలకు కావలసింది ఆదాయం. మందుబాబులకు కావలిసింది సారాయి. ఇక ఈ రెండింటిమధ్యలో నలిగిపోయేది ఇళ్లలో స్త్రీలు, పిల్లలు. ఇక గృహహింస నిరోధానికి మరిన్ని హెల్ప్లైన్లు పెడతారేమో.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments