ఇస్కాన్ (ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్సియోస్నెస్) ఒక హిందూ ధర్మ ప్రచార మరియు సేవా సంస్థ. ఇది భక్తి వేదాంత స్వామి ప్రభుపాద ద్వారా 1966 సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో స్థాపించబడింది. ఈ సంస్థను హరేకృష్ణ మూవ్మెంట్ అని కూడా పిలుస్తారు.
ఈ సంస్థ అమెరికాలో స్థాపించబడినప్పటికీ దీని మూలాలు భారత దేశంలోని బెంగాల్ లో ఉన్నాయి. 15 వ శతాబ్దం మొదటిలో చైతన్య మహాప్రభు ద్వారా స్థాపించబడిన గౌడీయ వైష్ణవ సంప్రదాయం నుండి వచ్చినదే హరే కృష్ణ మూవ్మెంట్. చైతన్య మహా ప్రభు శిష్యులు హరే కృష్ణ మహామంత్రాన్ని పఠిస్తూ సంతోషంగా పాడుతూ, నృత్యం చేస్తూ కృష్ణ భక్తిలో లీనమైపోయేవారు. ఇదే సంప్రదాయం ఇప్పటికీ ఇస్కోన్ కేంద్రాలలోను, దేవాలయాలలోను కొనసాగుతున్నది.
ఇస్కోన్ వ్యవస్థాపకుడైన భక్తివేదాంత స్వామి ప్రభుపాద గొప్ప విద్వాంసుడు మరియు తత్వవేత్త. ఈయన ఎన్నో సనాతన ధర్మ పవిత్ర గ్రంధాలను ఆంగ్లం లోనికి అనువదించడమే కాకుండా వాటికి భాష్యాలను కూడా వ్రాసారు. ఈయన వ్రాసిన ‘భగవద్ గీత యథాతథము’ అత్యంత ప్రసిద్ధి గాంచింది. ఈయన చేసిన అనువాదాలు భారతీయ తత్వశాస్త్రాన్ని, సనాతన ధర్మాన్ని భారత దేశంలోనే కాకుండా, పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రజలకు తెలియజెప్పడానికి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
ప్రస్తుతం ఇస్కోన్ అనేక దేశాలలో వేళ్లూనుకొని అక్కడి ప్రజల్లో భారతీయ ఆధ్యాత్మిక భావనలను ముఖ్యన్గా కృష్ణ భక్తిని, భగవద్ గీతను ప్రచారం చేయడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినపుడు బాధితులకు ‘ఫుడ్ ఫర్ లైఫ్’ అనబడే సంస్థ ద్వారా ఆహార వితరణ, నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించడం వంటి కార్యక్రమాలను వివిధ దేశాలలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నది. భారత్ లో తన ఇస్కోన్ ఫుడ్ రిలీఫ్ ఫౌండేషన్ (అన్నాఅమృత) పథకం ద్వారా వేలాది మంది విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నది.