యంత్రాలు నేర్చుకుంటున్నాయి, జనాలు వాటికి బానిసలవుతున్నారు

0
42

సాంకేతిక పరిజ్ఞానం శరవేగంగా అభివృద్ధి చెందుతుండడంతో ‘సాంకేతిక అభివృద్ధి’ అనే పదాన్ని ప్రక్కనబెట్టి ‘సాంకేతిక విస్ఫోటనం’ అనే పదాన్ని వాడడం మొదలు పెట్టాం. కృత్రిమ మేధ ను ఆవిష్కరించిన తర్వాత యంత్రాలు కూడా నేర్చుకొనే శక్తిని పొందాయి. తాము నేర్చుకున్న విషయాలను ఉపయోగిస్తూ యంత్రాలు స్వతంత్రంగా పనిచేయగలిగే శక్తిని సమకూర్చుకుంటున్నాయి.

ఇక మనుషుల విషయానికి వస్తే, ప్రస్తుత ప్రపంచంలో మనుషులు జీవిత కాలం అభ్యసించాల్సిన పరిస్థితి కనబడుతున్నది. ఎందుకంటే పాత సాంకేతికత స్థానంలో క్రొత్త సాంకేతికత వస్తుండడంతో, మార్పులు శరవేగంగా జరుగుతుండడంతో ఉద్యోగులు, ఉద్యోగాభిలాషులు ఎప్పటికప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటుండాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే ఆవిధంగా జరుగుతున్నదా, మనం కొత్త విషయాలు నేర్చుకోవడంపై ద్రుష్టి పెడుతున్నామా అని మనలను మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

యంత్రాలు నేర్చుకుంటుంటే జీవితకాలం అభ్యసించాల్సిన జనాలు తమ సెల్ ఫోన్లు, గేమింగ్ పరికరాలకు హత్తుకుపోయి తమ తోటి వారిని కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ స్క్రీన్ ఎడిక్షన్ వలన మానవ సంబంధాలు పాడవడమే కాకుండా చాలామంది మానసిక అనారోగ్యానికి కూడా గురవుతున్నారని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.

నిజానికి అంతర్జాలం ఒక విజ్ఞాన గని. సవ్యంగా ఉపయోగించుకుంటే అది విజ్ఞానం పెంచుకోవడానికి మనకు ఎంతగానో ఉపకరిస్తుంది. కానీ అత్యధిక శాతం మంది సోషల్ మీడియా లో సమయం వృధా చేయడం, ఎటువంటి ఉపయోగం లేని తప్పుదారి పట్టించే విధంగా ఉంటున్న యూట్యూబ్ వీడియోలు చూడడంపై ద్రుష్టి కేంద్రీకరిస్తుండడంతో వారి విజ్ఞానంలో ఎటువంటి వృద్ధి కనిపించడంలేదు. అందువలన వారి కెరీర్ లు పాడయిపోతున్నాయి.

మరి పరిస్థితి ఇదేవిధంగా కొనసాగితే యంత్రాలు నేర్చుకొని మనుషుల్ని దాటి ముందుకు వెళ్ళిపోతాయా? మనుషులపై అధికారం చెలాయించడం మొదలుపెడతాయా?

మనుషులు తమ సౌకర్యం కోసం, సంక్షేమం కోసం యంత్రాలను సృష్టించుకున్నారు. అవి ఎప్పుడూ మనుషుల అదుపులోనే ఉండాలి. కానీ యంత్రాలు నేర్చుకుంటూ ముందుకు వెళ్ళిపోయి మనుషులపై ఆధిపత్యం సాధిస్తే మనం యంత్రాలకు బానిసలమవ్వాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. అటువంటి పరిస్థితి కనుక వస్తే మానవాళి నిర్వీర్యమయిపోయి సంక్షోభంలో పడిపోతుంది.

అందుకే మనుషులంతా ‘జీవితకాలం అభ్యసించు’ అనే సూక్తిని వంటబట్టించుకొని కొత్త విషయాలు నేర్చుకోవడంపై దృష్టిపెట్టాలి.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments