ప్రధాని మోడీ కొన్ని రోజులక్రితం జాతినుద్దేశించి చేసిన ప్రసంగంలో ‘లోకల్ కేలియే వోకల్ బన్నా హై’ అంటూ దేశీయంగా తయారైన వస్తువులనే వినియోగించాలని పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వం 2014 లో స్వదేశీ పరిశ్రమల్ని, తద్వారా స్వదేశీ వస్తువుల తయారీ మరియు వినియోగాల్ని ప్రోత్సహించడమే ధ్యేయంగా ‘మేక్ ఇన్ ఇండియా’ ప్రచారోద్యమాన్ని చేపట్టింది.
కరోనా మహమ్మారి విశృంఖలంగా ప్రబలుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని దేశాలు ఆర్ధిక స్వావలంబనపై ద్రుష్టి కేంద్రీకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ ‘ఆత్మ నిర్భర్ భారత్’ నిర్మాణం కోసం పిలుపునిచ్చారు.
The way ahead lies in LOCAL.
Local Manufacturing.
Local Markets.
Local Supply Chain.
Local is not merely a need but a responsibility.
Be vocal about local! #AatmanirbharBharat pic.twitter.com/eYqt5IDtBp
— Narendra Modi (@narendramodi) May 12, 2020
దేశంలో మళ్ళీ స్వదేశీ నినాదాలు ప్రతిధ్వనిస్తుండడంతో ప్రజలలో స్వదేశీ పై అవగాహన పెరగడమేకాక దేశీయంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులనే కొనాలనే ఉత్సుకత పెరుగుతున్నది. అయితే ఏవి భారత్లో ఉత్పత్తి చేయబడిన వస్తువులు ఏవి దిగుమతి చేసుకోబడిన వస్తువులు అనే విషయంపై ప్రజలకు ఒక స్పష్టమైన అవగాహన లేకపోవడంతో ఆవిషయం పై చర్చ మొదలైంది.
దేశీయంగా ఉత్పత్తి చేయబడిన వస్తువులని ఏవిధంగా గుర్తించాలి అనేవిషయంపై కూడా చర్చ సాగుతున్నది. ఈ విషయంపై పరిశోధన చేసినవాళ్లు ఏవస్తువుపైనైనా ముద్రించబడిన బార్కోడ్ ను జాగ్రత్తగా గమనిస్తే ఆ వస్తువు ఎక్కడ తయారైందో చెప్పవచ్చునంటున్నారు. భారత్లో తయారైన లేదా ప్యాక్ చేయబడిన వస్తువుల బార్ కోడ్ 890 తో మొదలవుతుందని అంటున్నారు.

అయితే ఇక్కడ గమనించవలసిన మరొక విషయమేమంటే విదేశీ మరియు బహుళజాతి సంస్థలు తయారు చేసిన వస్తువులు కూడా అవి భారత్లో తయారైతే వాటి బార్ కోడ్ లు కూడా 890 తోనే మొదలవుతాయి. ఉదాహరణకు హిందూస్తాన్ యూనీలీవర్ కంపెనీ ఉత్పత్తి చేసే విమ్ డిష్వాషర్ లిక్విడ్ పై ఉండే బార్ కోడ్ కూడా 890 తోనే ప్రారంభమవుతుంది. అయితే ఈ హిందూస్తాన్ యూనీలీవర్ బ్రిటిష్-డచ్ బహుళజాతి సంస్థ అయిన యూనీలీవర్ కు అనుబంధగా ఉండడం వాళ్ళ ఇది భారతీయ సంస్థ కాదు. కాబట్టి ఇటువంటి సంస్థలు ఉత్పత్తి చేసి అమ్మే వస్తువులు కొనవచ్చా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి.


అంతేకాకుండా షావోమి, వివో వంటి చైనా కంపెనీలు కూడా ఇప్పుడు భారత్లోనే వాటి స్మార్ట్ ఫోన్లు తయారు చేస్తూ భారతీయులకు ఉపాధి కల్పిస్తున్నాయి. మరి వీటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అటువంటి వస్తువులని కొనవచ్చా అనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
కాబట్టి ఈ స్వదేశీ విషయం పై సమాజంలో పెద్దఎత్తున చర్చ జరగాలి. ప్రజల్లో అవగాహన కల్పించాలి. అంతేకాకుండా ప్రజలకు ఒక స్పష్టమైన మార్గనిర్దేశనం చేస్తూ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లగలిగిన నాయకత్వం కూడా ప్రజలకు అవసరం. అప్పుడే భారత్ ఆర్థిక జాతీయతా వాదాన్ని మనసులో నింపుకొని స్వావలంబన వైపుకు అడుగులు వేయగలదు.