ఆహారపు అలవాట్లే ఆయురారోగ్యాలకు బాటలు

ఆహారం మన నిత్య జీవితంలో అంతర్భాగం. అందుకే అన్నం పరభ్రహ్మ స్వరూపం అంటూ అన్నాన్ని భగవంతుడితో పోలుస్తారు. మనం రోజంతా కస్టపడి ఎంత హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ లు సృష్టించినా సాయంత్రానికి అవేవీ తినడానికి పనికి రావు. కటిక పేదవాడైనా, అపర కుబేరుడైనా ముప్పూటలా కోరుకునేది పట్టెడన్నం మాత్రమే.

అందుకేనేమో ఆరుగాలం కష్టపడి తిండి గింజలు పండించే రైతుకు అంత ప్రాధాన్యత, ఆ వృత్తికి అంత గౌరవం. ఆకలి తీర్చుకోవడం ఒక భౌతిక అవసరం. అందుకే అన్నాన్ని ఆకలైనప్పుడే తినాలి. అందుకేనేమో పెద్దలు ‘తినడం కోసం బ్రతుకకు బ్రతకడం కోసం తిను’ అంటూంటారు. అతిగా తినేస్తే ఆరోగ్యం తగ్గిపోయి రకరకాల వ్యాధులు ముసురుకుంటాయి.

నా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళింటికి వెళ్ళినప్పుడల్లా వేడి వేడి అన్నం, ముద్ద పప్పు, ఆవకాయ పచ్చడి, బోలెడంత నెయ్యి, చివరిలో గడ్డ పెరుగన్నం, దాదాపుగా రోజూ అదే. బట్టర్ పనీర్ మసాలా, ఫ్రెంచ్ ఫ్రైస్, ఐస్క్రీమ్స్, చికెన్ సిక్సటీఫైవ్ వంటివి వినలేదుకూడా.
Embed from Getty Images

ఇక సాంకేతికత పెరుగుతున్న కొద్దీ ఆదాయాలు, ఆస్తులు పెరిగాయి. జిహ్వ చాపల్యం పెరిగిపోయింది. రుచులు రుచులుగా తినాలనే, అన్ని రుచులు చూడాలనే తపన పెరిగింది. అందుకే షెఫ్ లకు ప్రాధాన్యత పెరిగి సెలబ్రిటీ షెఫ్ లు వచ్చి టీవీల్లో హల్చల్ చేయడం మొదలుపెట్టారు. రక రకాల వంటలు ముఖ్యన్గా రక రకాల జంతువుల మాంసాల్ని రుచులు రుచులుగా ఎలా వండుకు తినాలో చూపిస్తూ మిలియన్లకొద్దీ వీడియో లు వచ్చేస్తున్నాయి.

రెస్టారెంట్లు పెరిగి పోయి జనాలు ఏ రెస్టారెంట్లో ఏమి దొరుకుతుందో అంటూ వెదక సాగారు. రుచులు పెరిగి పోవడంతో తిండి పెరిగిపోయింది. తిండి పెరగడంతో కొలెస్ట్రాల్, ఊబకాయం, యూరిక్ ఆసిడ్, చెక్కెర వ్యాధి వంటి రకరకాల వ్యాధుల బారిన పడి జనాలు ఆసుపత్రుల వెంట తిరుగుతున్నారు.

మితాహారం, అదికూడా ఆకలైనప్పుడే తినడం ఆరోగ్యానికి ముఖ్యం. ఎప్పుడైతే రుచి వెంట పరుగెత్తుతామో అప్పుడే మన ఆరోగ్యం దిగజారిపోవడం మొదలవుతుంది.

ఇక యుట్యూబ్ వీడియోల్లో రకరకాల వ్యక్తులు అది తింటే మీ ఆరోగ్యం మెరుగవుతుంది, ఇది తాగితే మీ కొవ్వు కరుగుతుంది, ఈ ఆకు పసరు తాగితే మీ ఆరోగ్యానికి ఢోకా ఉండదు అంటూ చెబుతూంటారు. అటువంటి వీడియోలు మిలియన్లకొద్దీ ఉండడంతో ఏ వీడియో లో చెప్పిన సలహా ఆచరించాలో తెలియక జనాలు సతమతమై పోతున్నారు.

అందుకే రుచులవెంట పరుగెత్తకుండా, సరళమైన మన సాంప్రదాయ ఆహారాన్ని మితంగా, సమయానుసారంగా తీసుకుంటూ ముందుకు సాగితే మన ఆరోగ్యం బాగానే ఉంటుందనడంలో ఎటువంటి సందేహం లేదు.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments