కరోనా వైరస్ వాక్సిన్ అభివృద్ధి, తయారీ ప్రయత్నాలు ముమ్మరం

0
82

కరోనా మహమ్మారి రెండవ వేవ్ వచ్చేస్తోందనే వార్తలు పతాక శీర్షికలకు ఎక్కుతూ ఉండడంతో ప్రజలు భయభ్రాంతులకు లోనవుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటివరకు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రా జెనెక వ్యాక్సిన్ మాత్రమే ప్రభావవంతంగా పని చేస్తున్నది అని అంటున్నారు. దేశీయ ఔషధ కంపెనీలయిన భారత్ బయోటెక్ మరియు జైడస్ కాడిలా కూడా వ్యాక్సిన్లను అభివృద్ధి చేస్తున్నప్పటికీ అవి ఇంకా ట్రయల్స్ దశలోనే ఉన్నాయి.

ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ తయారీదారు గా పేరెన్నికగన్న సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆస్ట్రా జెనెక వ్యాక్సిన్ ను ఉత్పత్తి చేస్తున్నది. డిసెంబర్ నెలలోగా తాము వంద మిలియన్ డోసుల వ్యాక్సిన్ ఉత్పత్తి చేయబోతున్నామని, డిసెంబర్ నెల నుండి భారత్‌లో కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ ఇచ్చే కార్యక్రమం మొదలవుతుందని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈఓ ఆదార్ పూనావాలా చెబుతున్నారు.

అహ్మదాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ప్రముఖ ఔషధ సంస్థ జైడస్ కాడిలా మరియు హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలు కొనసాగిస్తున్న భారత్ బయోటెక్ లలో అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లు మంచి ఫలితాలను ఇస్తున్నాయి అనే వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ అహ్మదాబాద్‌లోని జైడస్ కాడిలా, పూణేలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ కంపెనీల కార్యాలయాలను సందర్శించి అక్కడి వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమైన శాస్త్రవేత్తలతో సంభాషించబోతున్నారు.

ప్రజలు వాక్సిన్ కోసం ఆతృతతో ఎదురు చూస్తున్న ఈ సందర్భంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యత సంతరించుకున్నది. తాను స్వయంగా వ్యాక్సిన్ అభివృద్ధి తయారీలో నిమగ్నమై ఉన్న సంస్థలను, శాస్త్రవేత్తలు కలుసుకోవడం భారత ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడం పై చాలా శ్రద్ధ వహిస్తున్నది అనడానికి నిదర్శనం. ప్రధాని సందర్శన ఈ సంస్థలన్నీ తమ కార్యకలాపాల్ని ఇంకా వేగవంతం చేసి ఒక సమర్థవంతమైన, దుష్ప్రభావాలు లేని వ్యాక్సిన్‌ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తుందని ఆశిద్దాం.

ఇప్పటికే ఈ కరోనా మహమ్మారి సృష్టించిన విలయం వలన వ్యాపార సంస్థలు మూతపడుతున్నాయి. ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడంతో వారి కొనుగోలు శక్తి తగ్గిపోయి ప్రపంచవ్యాప్తంగా వస్తు సేవలకు డిమాండ్ తగ్గిపోయింది. ఆర్థిక వ్యవస్థలు కుదేలయిపోతున్నాయి. ఇక పరిస్థితి ఇదే విధంగా ఇంకా కొంత కాలం కొనసాగితే సమాజంలో ఈ వైరస్ ఆకలి చావులకు కూడా దారితీసే ప్రమాదం ఉంది. అందుకే ప్రభుత్వం వ్యాక్సిన్ అభివృద్ధి మరియు తయారీపై ఇంతగా దృష్టి పెడుతున్నదన్న విషయం మనకు స్పష్టమవుతున్నది.

భారత ప్రభుత్వ ప్రయత్నాలు సఫలీకృతమై ప్రజలకు కరోనా వ్యాక్సిన్ త్వరలోనే అందుబాటులోకి వస్తుందని ఆశిద్దాం.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments