అనారోగ్యం రెండువిధాలుగా ఉంటుంది – ఒకటి శారీరక అనారోగ్యమయితే మరొకటి మానసిక అనారోగ్యం. శారీరక అనారోగ్యం బారిన పడినపుడు వైద్యులను సంప్రదిస్తాం, మందులు వాడతాం. కానీ మన సమాజంలో మానసిక అనారోగ్యాన్ని తీవ్రంగా పరిగణించం. పైగా తమకు మానసిక సమస్యలు ఉన్నాయనే విషయాన్ని చాలామంది దాచిపెడతారు. తోటివాళ్ళు విచిత్రంగా చూస్తారేమోననే, తమ మానసిక దౌర్బల్యాన్ని హేళన చేస్తారేమోననే భయం, అనుమానం బయటకు చెప్పనివ్వవు.
ప్రస్తుత కాలమాన పరిస్థితులు మానసిక సమస్యలు ప్రబలడానికి అత్యంత అనుకూలంగా ఉన్నాయి. పలురకాల వస్తు సేవలు జిగేల్ మంటూ కనిపించే భౌతికవాద ప్రపంచం జనాలను ఊరిస్తున్నది. ఆ వస్తువులు మేము కొనుక్కోలేకపోతున్నాము, అనుభవించలేక పోతున్నాము అనే భావన మనసును తొలుస్తుండడంతో చాలామంది ఆత్మ న్యూనతా భావంలోకి జారిపోతున్నారు. మరికొందరు ఈ ఉరుకులు పరుగులతో సాగిపోయే ప్రపంచంలో మిగతావారితో కలిసి సాగలేక, మానసిక ఒత్తిడులను తట్టుకోలేక నిరాశకు గురవుతున్నారు. ఆర్ధిక సమస్యలు, కుటుంబ సమస్యలు, దురలవాట్లు కూడా పలువురిని వేధిస్తున్నాయి.
ఈ మానసిక సమస్యలు కొన్నిసార్లు మూఢ భక్తి రూపంలో కూడా బయటకు వస్తాయి. ఆంధ్ర ప్రదేశ్ లోని మదనపల్లెలో విద్యాధికులైన తల్లిదండ్రులు, ఉన్నత చదువులు చదువుతున్న వారి పిల్లలు ఏ విధంగా మానసిక సమస్యలతో మూఢ భక్తి లోకి జారుకుని ప్రాణాలమీదికి తెచ్చుకున్నారో అందరికీ తెలిసిందే.
మానసిక సమస్యలతో బాధపడేవారు తమ సమస్యలను తమ కుటుంబ సభ్యులతోను, స్నేహితులతోను చెప్పుకోవాలి. అప్పుడే వారికి కొంత స్వాంతన చేకూరుతుంది. దగ్గరివారు ధైర్యం చెప్పడానికి, సహాయం చేయడానికి వీలవుతుంది. మనసులోనే ఉంచుకొని మధనపడుతూఉంటే సమస్య జటిలమైపోతుంది. సరైన సమయంలో మానసిక వైద్యులను సంప్రదించడం, ఒంటరితనం లోకి వెళ్లిపోకుండా కుటుంబంతోనూ, స్నేహితులతోను గడపడం వంటివి పరిస్థితి మెరుగవడానికి దోహదం చేస్తాయి.
అంతేకాకుండా వీలైనంత వరకూ ఖాళీగా ఉండకుండా ఏదోఒక ఉపయోగకరమైన వ్యాపకంలో మునిగి ఉంటే ప్రతికూల ఆలోచనలు రాకుండా మనసును అదుపులో ఉంచుకోవచ్చు. మంచి పుస్తకం చదవడం, విహార యాత్రకు వెళ్లడం వంటివి మనసును ఆహ్లాదంగా ఉంచుకోవడానికి దోహదపడతాయి.
చైనా వైరస్ మహమ్మారి విలయ తాండవం చేయడం మొదలైనప్పటినుండీ జనాలు చాలా వరకూ ఇళ్లలోనే ఉండడం వల్ల వాళ్ళ మానసిక ఆరోగ్యం పై ప్రతికూల ప్రభావం పడింది. ఈ వైరస్ ప్రజల ఉపాధి అవకాశాలపై కూడా ప్రతికూల ప్రభావంచూపడంతో పరిస్థితి మరింత క్షీణించింది. అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ తమ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా సంరక్షించుకోవడంపై ద్రుష్టి పెట్టాలి.