తెలంగాణా లో కరోనా మృత్యు ఘంటికలు

0
410

దేశంలో చెత్త రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణా ప్రభుత్వమే అని చెప్పుకోవాలి. ‘తెలంగాణా రాష్ట్ర పిత’ నిన్న మొన్నటిదాకా పిట్టలదొర మాదిరిగా మాటలు కోటలు దాటించారు. చైనా వైరస్ పై పోరులో తన డొల్లతనం బయటపడి పరిస్థితి అదుపుతప్పడంతో ఇక లాభంలేదనుకున్నారేమో ముఖం కూడా చూపించకుండా జారుకున్నారు.

చైనా వైరస్ అదుపుచేయడానికి టెస్టింగ్ చాలా కీలకమని నిపుణులు మొదటినుండీ నెత్తీ నోరూ కొట్టుకొని చెబుతూనే ఉన్నారు. మరి మన పిట్టలదొరకి తన మాటే కానీ ఇతరుల మాట సుతారమూ ఇష్టముండదనుకుంటా. అందుకే రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం దాదాపుగా రోజూ అక్షింతలు వేస్తున్నప్పటికీ పెడచెవినబెట్టారు. ఇక రాష్ట్రంలో ప్రజా వైద్య వ్యవస్థ కుప్పకూలి మృత్యువు కరాళనృత్యం చేయడం మొదలుపెట్టడంతో ఇక తన పప్పులుడకవనుకున్నారేమో, ‘హరితహారం’ పేరుతొ మొక్కలు నాటండి అంటూ కొత్తపాట అందుకున్నారు.

టెస్టింగ్ చేస్తే కరోనా కేసులు బయట పడతాయేమో, చేయకపోతే బయటపడవుగా అన్నట్లుగా మూర్ఖంగా ప్రవర్తిస్తూ వైరస్ మరింతగా పాకిపోవడానికి ప్రభుత్వమే కారణభూతమౌతున్నది. తెలంగాణా జనాభా నాలుగు కోట్లు ఉంటె అందులో కోటి మందికి పైగా, అంటే పావు వంతు ప్రజలు హైదరాబాద్ మహానగరంలోనే నివసిస్తున్నారు. నగరంలో విపరీతమైన జన సాంద్రత వల్ల వైరస్ వేగంగా పెరుగుతూ పోతున్నది. కేవలం కొన్ని ప్రభుత్వ ఆసుపత్రులలోనే కరోనా వైద్యం అందుబాటులో ఉన్నది.
Embed from Getty Images

కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు కూడా కరోనా వైద్య సేవలందించడానికి అనుమతి ఇచ్చినప్పటికీ ఆ ప్రైవేట్ వైద్యశాలలు అధిక ఫీజులు వసూలుచేస్తూ రోగుల్ని రాబందుల్లా పీక్కు తింటున్నాయనే విమర్శలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రులన్నీ నిండిపోయి రోగులకు పడకలు కూడా దొరకని పరిస్థితి ఏర్పడడంతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. నిన్న మొన్నటి దాకా తెలంగాణా ధనిక రాష్ట్రం అంటూ గొప్పలు చెప్పుకున్న కె సి ఆర్ ప్రభుత్వం ఈ కోవిద్ సమయంలో ప్రజలకు కనీస వైద్యసేవలందించలేక చేతులెత్తేసింది.

అసలే హైద్రాబాదులో ఒకేగదిలో పలువులు నివసిస్తూ కనీసం కరోనా లక్షణాలు కనబడితే సెల్ఫ్ క్వారంటైన్ చేసుకొనే అవకాశం కూడాలేక బాధపడుతున్న ఈ దశలో సచివాలయ భవనాన్ని వాస్తు బాగాలేదనే పేరుతొ కూల్చివేయడం హేయమైన చర్య. తన కుటుంబపాలన రాష్ట్రంలో అప్రతిహతంగా కొనసాగాలనే దుర్భుద్ధితో, మూఢ నమ్మకాల వలలో చిక్కుకొని ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు.

తెలంగాణా రాష్ట్రం వస్తే తమ బ్రతుకులు బాగుపడతాయని ఆశించిన వాళ్ళ ఆశలు అడియాసలే అయ్యాయని స్పష్టంగా తెలుస్తూనే ఉన్నది. అవినీతి, బంధుప్రీతి, ప్రజాధనం దుర్వినియోగం, విచ్చలవిడితనం వంటి దుర్లక్షణాలు ఈ ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తున్నాయి. పాలన స్తంభించిపోవడంతో చివరకు గవర్నర్ కూడా జోక్యం చేసుకొని ప్రయివేట్ ఆసుపత్రుల అరాచకాల గురించి ఆరాతీయడం చర్చనీయాంశమయింది.

మృత్యు ఘంటికలు చెవులు దద్దరిల్లేలా వినిపిస్తుండడంతో జనాలు భయపడిపోతున్నారు. హైదరాబాదు మహానగరాన్ని విడిచిపెట్టి తమతమ గ్రామాలకు చేరుకుంటున్నారు. కొద్ది మంది కోవిద్ రోగులు తమ చివరి క్షణాల్లో సెల్ఫీ వీడియోల్లో అప్పగింతలు పెట్టి హృదయ విదారకమైన రీతిలో చనిపోతున్నారు.

ఇక ఈ చైనా వైరస్ నుండి తెలంగాణా ప్రజలను ఆ దేవుడే కాపాడాలి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments