కరోనా టీకా మానవాళిని ఒడ్డునపడేస్తుందా?

0
519

కరోనావైరస్ మహమ్మారి కోరలు చాచడం ప్రారంభించిన తరువాత ఆ రోగాన్ని నయం చేయడానికి ఏ మందులు వాడాలి అనే విషయంపై ఆరోగ్య అధికారులు అయోమయంలో ఉన్నారు. ప్రారంభంలో హైడ్రాక్సీక్లోరోక్విన్ చాలా సమర్థవంతంగా పనిచేస్తున్నదని చాలామంది అభిప్రాయపడ్డారు. అయితే మరికొందరు దాని ఔషధ శక్తి విషయంలో విభేదించడమే కాక అది రోగులపై అనేక దుష్ప్రభావాలు చూపిస్తుందని అభిప్రాయపడ్డారు.

భారతదేశంలోని కొన్ని ఫార్మా కంపెనీలు ఫావిపిరవిర్ మరియు రెమ్‌డెసివిర్ వంటి మందులను విడుదల చేశాయి. ఈ మందులు ఇంతకుముందునుండే మనుగడలో ఉన్నప్పటికీ కరోనావైరస్ చికిత్సకు ఉపయోగపడుతూండడంతో వాటికి డిమాండ్ పెరిగింది. ఈ ఔషధాలన్నీ ప్రజల్లో చాలా ఆశలు రేకెత్తిస్తున్నాయి. మార్కెట్లో వివిధ ఔషధాలు లభ్యమవుతున్నప్పటికీ, వాటిలో ఏదీ కరోనావైరస్ వ్యాధికి పూర్తి విరుగుడుగా నిరూపించబడలేదు.

అందువల్ల మానవాళి కరోనావైరస్ టీకా లభ్యత కోసం ఆతృతగా వేచి ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థలు మరియు బయోటెక్ కంపెనీలు ఈ వైరస్ ను నివారించడానికి అవసరమైన వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేయడానికి ప్రశంసనీయమైన కృషి చేస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ మానవాళికి ఆశాకిరణంగా కనిపిస్తున్నది. భారతదేశంలో కూడా హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ ఒక వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం ఇది క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. ప్రస్తుతం అభివృద్ధి చేయబడుతున్న కొన్ని వ్యాక్సిన్లు మంచి ప్రభావాన్ని చూపిస్తున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ, అవి ఎప్పుడు మార్కెట్లోకి వస్తాయో ఇంకా తెలియడంలేదు.

క్లినికల్ ట్రయల్స్ విజయవంతంగా పూర్తిచేసుకున్న తర్వాత ఈ టీకాలు మార్కెట్‌లోకి వచ్చినప్పటికీ, ప్రపంచంలోని ప్రజలందరికీ అవసరమైన మోతాదును ఉత్పత్తి చేయడానికి చాలా కృషి, వనరులు అవసరం అవుతాయి. అంతేకాకుండా ఈ టీకా చాలా మందికి, ముఖ్యంగా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి అందుబాటులో లేకపోవచ్చు. మరియు ఈ టీకా మొదట్లో అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రమే లభ్యమయ్యే అవకాశం కనిపిస్తున్నది. వర్ధమాన దేశాల్లో పేద, దిగువ మధ్యతరగతి ప్రజలకు లభ్యం కావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఈ వ్యాక్సిన్‌ను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సబ్సిడీలు ఇవ్వవలసి రావచ్చు.

మానవాళి కరోనా వైరస్ టీకా కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నప్పటికీ, చాలా మంది నిపుణుల అభిప్రాయం ప్రకారం టీకా మార్కెట్లకు చేరుకోవడానికి కనీసం మరో ఆరు నెలలు పడుతుందంటున్నారు. టీకా అభివృద్ధి మరియు తయారీలో భారతదేశం కీలక పాత్ర పోషించబోతున్నదని చాలా మంది పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద టీకాల తయారీ సంస్థ అయిన భారత్ కు చెందిన సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా టీకా ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.

భారతదేశంలో 135 కోట్ల జనాభాకు టీకాలు వేయడానికి అపారమైన వనరులు మరియు కఠినమైన ప్రయత్నాలు అవసరం. ఈ కారణాలవల్ల చాలామంది నిపుణులు, పరిశీలకులు వ్యాక్సిన్‌తో వైరస్‌ను నివారించే అవకాశాలపై పెదవి విరుస్తున్నారు.

అందువల్ల, వ్యాక్సిన్ వస్తుందనే ఆశతో ప్రజలు నిర్లక్ష్యం వహించడానికి బదులు, ప్రాణాంతక వైరస్ నుండి తమను తాము సురక్షితంగా ఉంచుకోవడానికి అవసరమైన అన్ని జాగ్రత్తలను పాటించడం కొనసాగించాలి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments