కరోనా వైరస్ భయాలు, జాగ్రత్తలు

నడుస్తున్న కాలాన్ని కరోనా వైరస్ కు ముందు, తర్వాతి కాలాలు గా విభజించ వచ్చు. కరోనా వైరస్ తర్వాతి ప్రపంచం పూర్తి భిన్నమైందిగా కనిపిస్తున్నది. ఈ వైరస్ మన జీవన విధానంలో సమూలమైన మార్పులు తీసుకు వచ్చింది. ప్రజలు బయటకు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లాల్సివస్తే మాస్కు ధరించి, దానిపై ఫేస్ షీల్డ్ కూడా ధరించి, ఒక శానిటైజర్ సీసాను జేబులో వేసుకొని వెళ్లాల్సి వస్తున్నది.

ప్రజల్లో కూడా రెండు రకాల వ్యక్తులు కనిపిస్తున్నారు. ఒక రకం వ్యక్తులు సామాజిక బాధ్యత మరువకుండా పరిశుభ్రత, భౌతిక దూరం పాటిస్తూ తమను, తమ కుటుంబాన్ని, తమ సమాజాన్ని సురక్షితం చేయాలనే తపనతో ముందుకు సాగుతున్నారు. మరొక రకం వ్యక్తులు ప్రభుత్వం మరియు వైద్య నిపుణులు ఇస్తున్న సలహాలను పెడచెవిన బెట్టి, పరిశుభ్రత, భౌతికదూరం వంటి జాగ్రత్తలకు తిలోదకాలిచ్చి విచ్చలవిడిగా సంచరిస్తూ మొత్తం సమాజాన్ని ప్రమాదంలోకి నెట్టి వేస్తున్నారు.

ఇక ఈ కరోనా వైరస్ సృష్టించిన భయాల్ని ఆసరాగా చేసుకొని చాలామంది పలురకాల సలహాలిస్తున్నారు. పత్రికల్లోనూ, సామాజిక మాధ్యమాల ద్వారాను నిపుణులుగా చెప్పబడుతున్న వాళ్ళు రకరకాల సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ముఖ్యన్గా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి సి విటమిన్, డి విటమిన్ మరియు జింక్ మాత్రలను వాడాలని సలహా ఇస్తున్నారు. పౌష్టికాహారం తీసుకోవాలనీ సూచిస్తున్నారు.

అయితే ఏది పౌష్టికాహారం అనే విషయంలో ప్రజల్లో అనుమానాలున్నాయి. కొందరు మాంసం తినండి అని సలహా ఇస్తుంటే, మరికొందరేమో అసలీ వైరస్ జంతువుల్ని వధించే కబేళాల్లోనూ, మాంసం దుకాణాల్లోనూ పుట్టిందనీ అందుకే మాంసాహారం వదిలేయాలని సూచిస్తున్నారు. ఏదేమైనా మాంసం తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుందని ప్రభుత్వాలు, వైద్య నిపుణులు సూచించడంతో జనాలు మాంసం దుకాణాల ముందు వరుస కడుతున్నారు.

ఇక కొందరు ఆయుర్వేద వైద్యులు అశ్వగంధ చూర్ణం, గిలోయ్ జ్యూస్, ఆమ్లా జ్యూస్ వంటివి వాడడం ద్వారా రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతూండడంతో ఆయుర్వేద ఔషధాలకు కూడా బాగా డిమాండ్ పెరిగింది.

ఇక మరికొందరేమో సి విటమిన్ కోసం మన వంటగదిలో నిమ్మరసం చేసుకొని తాగితే సరిపోతుందనీ సలహా ఇస్తున్నారు. ఈవిధంగా పలువురు పలు రకాల సలహాలిస్తుండడంతో చాలా మంది ప్రజలు వాటిని పాటిస్తూ తమను తాము సురక్షితం చేసుకొనే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుంది అనే విషయంపై ఇంకా చాలా అనుమానాలున్నాయి. ఇంతవరకూ ఇది కేవలం దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు వెలువడే తుంపర ద్వారా వ్యాపిస్తుందని భావించారు. కానీ ఇప్పుడు ఇది గాలి ద్వారా కూడా వ్యాపించే అవకాశం ఉన్నదనే వార్తలు ప్రజల్లో భయాందోళనలకు దారితీసాయి.

ఏదేమైనా ఈ కరోనా వైరస్ ను ఏమాత్రం తక్కువ అంచనా వేయకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్న ప్రాణాంతకం అయ్యే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments