చిన జీయర్ స్వామి కుల సహిత సమాజం

0
123

ఈమధ్యనే చిన జీయర్ స్వామి ఏదో సందర్భంలో మాట్లాడుతూ మనకు కుల రహిత సమాజం అవసరం లేదు, కుల సహిత సమాజమే కావాలని సెలవిచ్చారు. ఆయన ఆ విధంగా మాట్లాడడాన్ని చాలామంది తప్పుబట్టారు.

పలు కులాలవాళ్ళు పరస్పరం సహకరించుకుంటూ కష్టసుఖాలను పంచుకుంటూ ప్రేమాభిమానాలతో బ్రతకాలంటూ ఒకింత మంచి మాటలే చెప్పినప్పటికీ, మరి అటువంటి హిందూ సమాజాన్ని మనం ఇంతకాలం ఎందుకు సాధించుకోలేక పోయాము అనే ప్రశ్న తలెత్తుతున్నది. హిందూ సమాజంలో అగ్ర కులస్తులుగా చెప్పబడే వాళ్ళు దళితులను నీచంగా చూడడం వల్లనే వాళ్లిప్పుడు ఇతర మతాల్లోకి వెళ్ళిపోయి హిందూ సమాజానికి బద్ధ శత్రువులుగా తయారయ్యారు.

ఒకవైపు క్రైస్తవ మిషనరీలు మరొకవైపు ఇస్లామిక్ ఉగ్రవాదులు హిందూ సమాజం పై దాడికి పొంచి ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో హిందూ సమాజాన్ని కులం పేరుతొ విడదీసే ప్రకటనలు శ్రేయస్కరం కాదు.

చాలా మంది స్వామీజీలు కేవలం బ్రాహ్మణులని వెంటవేసుకొని తిరుగుతూ కేవలం క్రతువులతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. రాయకీయ నాయకులతో స్నేహం చేస్తూ ఆశ్రమాలను విస్తరించుకుంటున్నారు. ఇటువంటి కార్యాకలాపాలవలన హిందూ సమాజానికి ఎటువంటి మేలు జరగదు. పైగా కులవ్యవస్థ జఠిలమై సమాజంలో అనైక్యత పెరుగుతుంది. హిందూ సమాజంలో అనైక్యత క్రైస్తవ మిషనరీలు, ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఊతమిచ్చి దేశ విచ్చిన్నానికి దారితీస్తుంది. అందుకే స్వామీజీలు మంచి చేయకపోయినా, కులం గురించి పదే పదే ప్రస్తావన తెచ్చి చెడు చేయకపోతే అంతే చాలు.

జీయర్ స్వామి కుల వివక్షను వ్యతిరేకించిన, విశిష్టాద్వైతాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప ఆధ్యాత్మిక తత్వ వేత్త అయిన రామానుజాచార్యుల విగ్రహాన్ని ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ఏర్పాటు చేశారు. ఈ విగ్రహ ఏర్పాటు హిందూ సమాజానికి స్ఫూర్తిగా నిలబడబోతున్నదనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంత మంచి ఆశయంతో పనిచేస్తున్న జీయర్ స్వామి మరొక అడుగు ముందుకు వేసి దళితులను అక్కున చేర్చుకొని వారిని ఈ బృహత్కార్యక్రమంలో ముందుంచినట్లయితే యావత్ప్రపంచానికి ఒక గొప్ప సందేశం ఇచ్చి ఉండగలిగే వారు.

చిన జీయర్ స్వామి వంటి వారు యావత్ హిందూ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తూ, హిందువులను చైతన్యవంతంగా, ఐక్యంగా ఉంచే ప్రయత్నం చేయాలి. అందుకోసం అన్ని కులాలవారినీ, ముఖ్యన్గా దళితులను చేరదీయాలి. అప్పుడే హిందూ సమాజం ఐక్యంగా ముందుకు సాగుతూ సవాళ్ళను ఎదుర్కోగలుగుతుంది.

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments