ఈరోజు బ్లాక్ ఫ్రైడే. ఈ బ్లాక్ ఫ్రైడే ని థాంక్స్ గివింగ్ ఫెస్టివల్ తర్వాతి రోజున జరుపుకుంటారు. థాంక్స్ గివింగ్ అనేది ఒక హార్వెస్ట్ ఫెస్టివల్. హార్వెస్ట్ ఫెస్టివల్ అంటే మన తెలుగు రాష్ట్రాల్లో పంట చేతికి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కదా, అదే విధంగా అమెరికాలో థాంక్స్ గివింగ్ జరుపుకుంటారు.
థాంక్స్ గివింగ్ తర్వాత రోజే బ్లాక్ ఫ్రైడే. ఈ బ్లాక్ ఫ్రైడే రోజు క్రిస్మస్ పండుగకు అవసరమైనటువంటి షాపింగ్ మొదలుపెడతారు. ఈ థాంక్స్ గివింగ్ పండుగతోటే అమెరికాలో హాలిడే సీజన్ మొదలు అవుతుంది.
హాలిడే సీజన్ మొదలు కావడంతో జనాలంతా పెద్ద ఎత్తున షాపింగ్ మొదలుపెడతారు. కొనుగోలు దారులను ఆకర్షించడం కోసం వ్యాపార సంస్థలు మంచి మంచి ఆకర్షణీయమైన డిస్కౌంట్లు కూడా ప్రకటిస్తాయి. ఈ సమయంలో అమ్మకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే అన్ని వ్యాపార సంస్థలు తమ అమ్మకాల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచుకోడానికి రకరకాల ప్రణాళికలు మరియు వ్యూహాలతో ముందుకు వస్తాయి.
బ్లాక్ ఫ్రైడే రోజు అమెరికాలో వ్యాపారసంస్థలు ఉదయాన్నే తెరుచుకొని డోర్ బస్టర్స్ డీల్స్ పేరుతొ చాలా ఆకర్షణీయమైన తగ్గింపు ధరలకు అమ్మకాలు మొదలు పెడుతాయి. తక్కువ ధరల్లో తమకవసరమైన వస్తువుల్ని సొంతం చేసుకోవడానికి కొనుగోలుగారులు ఎగబడతారు.
ఈ సంవత్సరం కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తుండడంతో ప్రపంచ వ్యాప్తంగా ఆర్ధిక వ్యవస్థలు బలహీన పడ్డాయి. చాలామంది ఉద్యోగాలు కోల్పోవడంతో వారి కొనుగోలు శక్తి తగ్గింది. ఈ నేపథ్యంలో ఈ సంవత్సరం బ్లాక్ ఫ్రైడే సందర్భగా అమ్మకాలు పడిపోయే అవకాశం ఉన్నదని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయం పడుతున్నారు. అయితే కరోనా మహమ్మారి భయం వలన కొనుగోలు దారులు సంప్రదాయ దుకాణాల నుండి కొనుగోలు చేయడానికి వెనుకాడుతున్నారు. అందువలన ఈకామర్స్ సంస్థల అమ్మకాలు పెరిగే అవకాశం ఉన్నదని మరి కొంత మంది విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.