గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతోంది. ఆ పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తోంది. దుబ్బాక ఉప ఎన్నికలో విజయం ఈ ఉత్సాహానికి ముఖ్యమైన కారణం. ఇక కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కుంచించుకుపోతుండడంతో ఆ పార్టీ స్థానాన్ని భారతీయ జనతా పార్టీ ఆక్రమించింది.
జీహెచ్ ఎం సి ఎన్నికల్లో ప్రధానమైన పోరు భారతీయ జనతా పార్టీ, టిఆర్ఎస్ ల మధ్య ఉండబోతున్నది అనేది స్పష్టంగా తెలుస్తున్నది. టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పిట్టలదొర వలె గొప్పలు చెప్పుకోవడం తప్ప చేసింది ఏమీ లేక పోవడంతో ప్రజల్లో అపనమ్మకం పెరిగిపోయింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రజలు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కేసీఆర్ ప్రభుత్వం యొక్క పాలనా పరమైన వైఫల్యాలు కూడా ఆ పార్టీని వెంటాడుతున్నాయి. ఈ మధ్యనే వరదల్లో చిక్కుకుని ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నప్పటికీ వారిని ఆదుకోవడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫలమవడంతో ప్రజల్లో టిఆర్ఎస్ ప్రభుత్వం పట్ల విముఖత పెరిగింది. ఈ విముఖతను తనకు అనుకూలంగా మలుచుకోవడంలో భారతీయ జనతా పార్టీ చాలావరకు సఫలీకృతమైంది అని చెప్పుకోవచ్చు.
ఇక తమకు వచ్చిన ఈ అవకాశాన్ని వదులుకో దలచుకోని భారతీయ జనతా పార్టీ నాయకులు ఒకరి తర్వాత ఒకరు హైదరాబాద్కు క్యూ కడుతున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బిజెపి ప్రెసిడెంట్ జగత్ ప్రసాద్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లు హైదరాబాద్ వచ్చి రోడ్ షో లలో పాల్గొన్నారు. పార్టీ అతిరథులు హైదరాబాద్ వచ్చి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండడంతో ఆ పార్టీ శ్రేణుల్లో మునుపెన్నడూ లేని ఉత్సాహం కనిపిస్తున్నది.
ఇక ప్రజలు టిఆర్ఎస్ – ఎం ఐ ఎం ల మధ్య దోస్తీ ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. రజాకార్ల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న ఒవైసీ లు ‘పంద్రాహ్ మినిట్’ అంటూ ‘పదిహేను నిమిషాల’ బెదిరింపును పదే పదే వల్లెవేస్తున్నారు. అంతేకాకుండా పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ల స్మృతి చిహ్నాలను కూల్చివేస్తామని బెదిరిస్తున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చినటువంటి రోహింగ్యాలకు పాతబస్తీలో ఆశ్రయం కల్పించి వారిని దేశ విద్రోహ కార్యకలాపాలకు పురిగొల్పుతున్నారు. తాము ఉన్నంతవరకు పాతబస్తీలో ఎవరు నీళ్ల బిల్లులు, కరెంటు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినా కూడా జరిమానాలు కూడా కట్టనవసరం లేదని ప్రజలను రెచ్చగొడుతూ తప్పుదారి పట్టిస్తున్నారు.
కెసిఆర్ తన ఓటు బ్యాంకు రాజకీయాల్లో భాగంగా, తెలంగాణాలో తన కుటుంబ పాలనను సుస్థిరం చేసుకోవడంలో భాగంగా ఎంఐఎం పార్టీని దువ్వుతూ వాళ్ళతో దోస్తీ చేస్తున్నారు. కెసిఆర్ అండ చూసుకుని ఒవైసీ లు చెలరేగిపోతూ హిందువుల పై దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఈ కారణంగా హైదరాబాద్ ప్రజల్లో కేసీఆర్ పట్ల విపరీతమైన వ్యతిరేక భావన ప్రబలిపోయింది. భారతీయ జనతా పార్టీ ప్రజల్లో కె సి ఆర్ పట్ల విముఖతను తమకు అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతమయినట్లుగా కనిపిస్తున్నది.
ఈసారి జిహెచ్ఎంసి ఎన్నికల్లో ముమ్మాటికీ విజయం తమదే అనే ధీమాతో భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు కనిపిస్తున్నారు. అందుకే జనాల కళ్లన్నీ ఇక డిసెంబర్ ఒకటో తారీకు జరగబోయే జిహెచ్ఎంసి ఫలితాలపైనే ఉన్నాయి. డిసెంబర్ 4న వచ్చే ఫలితాలు రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ యొక్క భవితవ్యాన్ని నిర్ణయిస్తాయి. ఒకవేళ జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ కనుక ఓడిపోతే ఇక కేసీఆర్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమయినట్లుగానే భావించాలి. భారతీయ జనతా పార్టీ మరొక దక్షిణాది రాష్ట్రంలో అధికారానికి చేరువ అవుతున్నట్లు భావించాల్సి ఉంటుంది.