కేసీఆర్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయా?

దుబ్బాక ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం తర్వాత తెలంగాణలో రాజకీయ పరిస్థితి అకస్మాత్తుగా మారిపోయింది. ఇప్పటివరకు మాకు ఎదురు లేదు అంటూ విర్రవీగుతూ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి, ఆ పార్టీ అధినాయకుడు కేసీఆర్ ఇప్పుడు భయపడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వేళ్ళూనుకుపోయాయి. పాలనా వైఫల్యాలు స్పష్టంగా కనబడుతున్నాయి.

పైగా రజాకార్ల వారసులైన ఎంఐఎం పార్టీతో అంటకాగుతూ హిందువుల విశ్వాసాలపై దాడి చేస్తున్నారు. భైంసాలో ఎంఐఎం గుండాలు తమపై చేసిన దాడిని హిందువులు ఇంకా మరచిపోలేదు. కెసిఆర్ అండ చూసుకుని ఎంఐఎం గూండాలు ‘పదిహేను నిమిషాల’ బెదిరింపులు పదే పదే వల్లె వేస్తున్నారు. ఈ కారణాల వల్ల ప్రజల్లో కెసిఆర్ ప్రభుత్వం పై విపరీతమైన వ్యతిరేకత ప్రబలిపోయింది. ఇక కేసీఆర్ను దించాల్సిన సమయం ఆసన్నమైందని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

ఎప్పటి నుండో తెలంగాణా లో పాగా వేయాలని శతవిధాల ప్రయత్నిస్తున్న భారతీయ జనతా పార్టీ కి ఇది ఒక పెద్ద అవకాశంగా కలిసొచ్చింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం తర్వాత ఆ పార్టీ ఇనుమడించిన ఉత్సాహంతో ముందుకు కదులుతోంది. నిన్న మొన్నటి వరకు బిజెపి ఎక్కడుంది, కాంగ్రెస్సే మాకు ప్రధాన ప్రత్యర్థి అంటూ సన్నాయి నొక్కులు నొక్కిన తెలంగాణ రాష్ట్ర సమితి ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ మా ప్రత్యర్థి అని ఒప్పుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్తంగా నాయకత్వ లోపంతో కుంచించుకు పోతూ ఉండడంతో ప్రజలకు ఆ పార్టీ పై నమ్మకం పోయింది. ఇప్పుడు తెలంగాణలో ప్రజలు ఒక బలమైన సైద్ధాంతిక నిబద్ధత గల, ప్రజలకు మంచి పాలనను అందించగల పార్టీ కోసం వెతుకుతున్నారు. వారందరికీ భారతీయ జనతా పార్టీ ఒక మంచి ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నది.

గ్రేటర్ హైదరాబాద్లో జరగబోతున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించగలిగితే కెసిఆర్ ఇక తన పాలనకు రోజులు దగ్గర పడ్డాయని గ్రహించాల్సి ఉంటుంది. ఈ పరిణామాలతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి రసకందాయంలో పడింది. రాష్ట్రానికి తానే జాతిపిత అని చెప్పుకుంటూ తన కుటుంబ పాలనను సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న కెసిఆర్ కు భారతీయ జనతా పార్టీ సాధిస్తున్న విజయాలు మింగుడు పడడం లేదు. ఇక భారతీయ జనతా పార్టీ తనకు గట్టి సవాల్ విసురుతుండడంతో కెసిఆర్ కూడా బిజెపి పైనే దృష్టి పెట్టారు.

తాను మళ్లీ ప్రాంతీయ నాయకులతో జట్టుకట్టి బిజెపికి కేంద్రంలో గట్టి ప్రత్యామ్నాయాన్ని ఇస్తామంటూ పిట్టలదొర వలే మళ్ళీ ప్రగల్భాలు పలకడం మొదలుపెట్టారు. మోడీపై సవాలు విసరడం కూడా మొదలుపెట్టారు. అయితే మోడీని సవాలు చేసిన నాయకులంతా దారుణంగా చతికిల పడ్డారనే విషయం కేసీఆర్కు బోధపడటం లేదు. ఆ దిశలో తానింతకు ముందు చేసిన ప్రయత్నాలు కూడా దారుణంగా విఫలమయ్యాయనే విషయం మరచిపోయినట్లున్నారు.

అసలు కెసిఆర్ ప్రజలకు కనపడడం మానేశారు. ఆయన తనయుడు కేటీఆర్ ఊరూరూ తిరుగుతూ  ప్రజలను కలుస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రజలతో మమేకం కాలేకపోతున్నారు. టిఆర్ఎస్ నాయకులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఇది తెలంగాణలో ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు ఒక బలమైన సైద్ధాంతిక నిబద్ధత గల పార్టీకి, పాలనపై దృష్టి పెట్టగల పార్టీకి ఓటు వేస్తారు అని ఆశిద్దాం.

 

0 0 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Inline Feedbacks
View all comments